3 నెలల్లో తితిదేకు రూ.1,300 కోట్ల కాంట్రాక్టులు

భూమన కరుణాకరరెడ్డి తితిదే ఛైర్మన్‌ అయిన 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సుమారు రూ.1,300 కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 27 Mar 2024 05:13 IST

అభినయ్‌రెడ్డి గెలుపు కోసం రూ.950 కోట్ల దేవస్థానం నిధులు
ప్రతిపనిలోనూ కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డికి పది శాతం కమీషన్‌
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భూమన కరుణాకరరెడ్డి తితిదే ఛైర్మన్‌ అయిన 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సుమారు రూ.1,300 కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. 15 రోజులకోసారి హడావుడిగా బోర్డు సభ్యులతో సమావేశాలు పెట్టి రూ.300 కోట్లుగా ఉన్న ఇంజినీరింగ్‌ బడ్జెట్‌ను అమాంతం రూ.1,500 కోట్లకు పెంచారని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి గెలుపు కోసమే తిరుపతి నగర అభివృద్ధికి రూ. 950 కోట్లను తితిదే బడ్జెట్‌ నుంచి కేటాయించారని మండిపడ్డారు. ప్రతి పనిలోనూ కరుణాకరరెడ్డ్డి, ధర్మారెడ్డి పది శాతం కమీషన్‌ తీసుకున్నారని ఆరోపించారు. అందుకే కనీసం బిల్డింగ్‌ డిజైన్లు లేకుండా వర్క్‌ఆర్డర్లు ఇచ్చి నిధులు విడుదల చేశారని దుయ్యబట్టారు. వీటిలో సీఎం జగన్‌కు వాటాలున్నాయని ఆరోపించారు. కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు ఆఘమేఘాలపై తీసుకున్న ఈ నిర్ణయాలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బాగున్నవి కూల్చి.. కొత్తవి కడతారా?

‘కరుణాకరరెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన 2023 సెప్టెంబరులో రూ.702.11 కోట్లు, అక్టోబరులో రూ.96.61 కోట్లు, నవంబరులో రూ.435 కోట్లు ఇంజనీరింగ్‌ పనుల కోసం అదనంగా కేటాయించారు. 2023-24 బడ్జెట్‌లో రూ.1,233 కోట్ల అదనపు ఖర్చుకు ఎలాంటి అనుమతులు లేవు. తిరుపతిలోని రెండు మూడు సత్రాలను ఆఘమేఘాలపై కూల్చేసి రూ.300 కోట్ల చొప్పున ఖర్చు చేసి మళ్లీ కొత్తవి కడతారట? బాగున్న వాటిని కూల్చేసి కొత్తవి కట్టడంలో ఆంతర్యమేంటి? వీటిని కూల్చడంతో అలిపిరి వద్ద భక్తులు చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది’ అని విజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డి హయాంలో అంతా రహస్యమే

‘జవహర్‌రెడ్డి తితిదే ఈవోగా ఉన్నంతవరకు అన్ని వివరాలు తితిదే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ధర్మారెడ్డి ఈవో అయినప్పటినుంచే ఒక్క వివరమూ లేదు. భూమన కరుణాకరరెడ్డి ఛైర్మన్‌ అయ్యాక తితిదే బోర్డు సమావేశాల్లో ఏం చర్చించారు? తీసుకున్న నిర్ణయాలేంటనేవి గోప్యంగా ఉంచుతున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి వైకాపా కోసం పనిచేస్తూ.. తితిదే ఉద్యోగులను, భక్తులను ప్రభావితం చేస్తున్నారు’ అని విజయ్‌కుమార్‌ ఆరోపించారు. ‘రాజకీయ లబ్ధి కోసమే ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ పొడిగించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు. వీటన్నింటినీ ఎన్నికల సంఘం పరిశీలించాలి. బోర్డు నిర్ణయాలను పున:సమీక్షించాలి’ అని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని