Updated : 28 Jun 2022 06:26 IST

ఏం చెప్పేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు?

భాజపా నేతలకు హరీశ్‌రావు ప్రశ్న
రైతులు, యువత ఉసురు పోసుకుంటోందని కేంద్రంపై ధ్వజం
గజ్వేల్‌లో ఎరువుల రేక్‌ పాయింట్‌ ప్రారంభం

గజ్వేల్‌, న్యూస్‌టుడే: జై జవాన్‌, జై కిసాన్‌ నినాదాన్ని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనాలోచిత విధానాలతో నై కిసాన్‌, నై జవాన్‌గా మార్చిందని మంత్రి  హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌ను మరో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎరువుల లోడుతో వచ్చిన గూడ్స్‌ రైలుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు, అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చి యువత ఉసురును కేంద్రం పోసుకుంటోంది. తెలంగాణకు ఏం చేశామని చెప్పుకొనేందుకు భాజపా నేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు? నీతి ఆయోగ్‌ రూ.24 వేల కోట్లు ఇవ్వమన్నా.. ఇవ్వనందుకా? వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసినందుకా? వడ్లు కొనాలని అడిగితే తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయాలని చెప్పినందుకు తెలంగాణకు వస్తున్నారా?’’ అని మంత్రి ప్రశ్నించారు.

‘‘కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్‌కు రైల్వేలైను మంజూరు కోసం కృషి చేసిన కేసీఆర్‌ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పూర్తి చేశారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు ఖర్చు చేసింది. 2,200 ఎకరాల భూమి సేకరణకు రూ.300 కోట్లు, రైల్వే లైన్‌కు మరో రూ.300 కోట్లు రాష్ట్రమే ఖర్చు చేసింది. మెదక్‌ రైల్వే లైన్‌కు ఇప్పటికే రూ.50 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు పెట్టాలని కేంద్రం చూస్తోంది. మిల్లర్ల నుంచి ముడి బియ్యమైనా తీసుకోకపోవడం సబబు కాదు. కాంగ్రెస్‌, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు’’ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గజ్వేల్‌లో రేక్‌ పాయింట్‌ వల్ల ఇక్కడి రైతుల కష్టం తీరిందని, మెదక్‌లో కూడా మరొకటి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డిని హరీశ్‌రావు కోరారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే వంద సంవత్సరాల వరకు ప్రజల అవసరాలు తీర్చే పనులు తెరాస హయాంలో జరుగుతున్నాయన్నారు. విత్తన కేంద్రంగా గజ్వేల్‌ అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని