పథకాలు కేంద్రానివి.. ప్రచారం తెరాసది

రాష్ట్రంలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి రెండురోజుల ముందే ఆ పార్టీ నాయకుల జోరు మొదలైంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా జాతీయ నాయకుల్ని పార్టీ రంగంలోకి దింపింది. నియోజకవర్గాల వారీగా

Published : 01 Jul 2022 05:44 IST

 గులాబీ నేతల అబద్ధాలను తిప్పికొట్టండి
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
 స్థానిక నాయకులకు, శ్రేణులకు భారతీయ జనతా పార్టీ నేతల ఉద్బోధ

రాష్ట్రంలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి రెండురోజుల ముందే ఆ పార్టీ నాయకుల జోరు మొదలైంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా జాతీయ నాయకుల్ని పార్టీ రంగంలోకి దింపింది. నియోజకవర్గాల వారీగా నియమితులైన ఇతర రాష్ట్రాల సీనియర్‌ నాయకులు, మంత్రులు, మాజీ సీఎంలు బుధ, గురువారాల్లో అప్పగించిన కేంద్రాలకు చేరుకున్నారు. స్థానికంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించడంపై దృష్టి పెట్టారు. ప్రజలతో సమావేశాలను నిర్వహించి మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్ని వివరిస్తూ, తెరాస పాలన అన్యాయంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పథకాలను రాష్ట్రానివిగా తెరాస ప్రచారం చేసుకుంటోందని, ఆ పార్టీ నేతల అబద్ధాలను తిప్పి కొట్టాలని.. వాస్తవాలను ప్రజలకు వివరించాలని స్థానిక నేతలకు, శ్రేణులకు ఉద్బోధించారు.

ఈనాడు - హైదరాబాద్‌

జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికవుతున్న నగరాన్ని పార్టీ జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు చుట్టేశారు. అంబర్‌పేట సభలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఖైరతాబాద్‌లో యూపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు స్వాతంత్రదేవ్‌ సింగ్‌, జూబ్లీహిల్స్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, కార్వాన్‌లో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఎంపీ వినోద్‌కుమార్‌ సోంకర్‌ సమావేశమయ్యారు. ఉప్పల్‌లో ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రఘుబార్‌ దాస్‌, నాంపల్లిలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయమంత్రి బీఎల్‌ వర్మ పాల్గొని ప్రసంగించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో..

సంగారెడ్డిలో రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి గులాబ్‌చంద్‌ అంతర్గత సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. సిద్దిపేటలో ఎంపీ అపరాజిత సారంగి నంగనూరులోని కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. సిద్దిపేటలో కార్యకర్తలతో మాట్లాడారు. దుబ్బాకలో కేరళ మాజీ అధ్యక్షుడు కె.రాజశేఖర్‌ పదాధికారులతో సమావేశమై సహపంక్తి భోజనం చేశారు. అందోలులో పార్టీ అధికార ప్రతినిధి ప్రేమ్‌శుక్లా, గజ్వేల్‌లో ఝార్ఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ ప్రకాష్‌, హుస్నాబాద్‌లో ఎంపీ దేబశ్రీ చౌధురి, జహీరాబాద్‌లో ఎంపీ ఉమేష్‌ జాదవ్‌, నర్సాపూర్‌లో ఎంపీ శివప్రసాద్‌ శుక్లా పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌లో...

మహబూబ్‌నగర్‌లో ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీర్థసింగ్‌ రావత్‌ పర్యటించారు. ఓ కార్యకర్త ఇంట్లో బసచేశారు. జడ్చర్లలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ మహిళా మోర్చా సమావేశం నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఆరాతీశారు.
భాజపా కార్యకర్తలపై తెరాస వారు కేసులు పెడుతున్నారని, దీనిపై కేంద్రం దృష్టిపెడుతుందని నాగర్‌కర్నూల్‌లో   గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌పటేల్‌ చెప్పారు. అచ్చంపేటలో జమ్మూకశ్మీర్‌ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌, కొల్లాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి పీఆర్‌ కృష్ణన్‌, కల్వకుర్తిలో ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌..

నిజామాబాద్‌ అర్బన్‌లో తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై ఇంటింటి ప్రచారం చేశారు. డిచ్‌పల్లిలో కేంద్ర మంత్రి ఫాగాన్‌సింగ్‌ కులస్తే బూత్‌ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆర్మూర్‌లో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌, కామారెడ్డిలో భాజపా ఐటీసెల్‌ కన్వీనర్‌ మిత్‌ మాలవీయ, ఎల్లారెడ్డిలో ఎంపీ భారతి బెన్‌ షల్యాల్‌, జుక్కల్‌లో విశాల్‌ జొల్లి పాల్గొన్నారు.

ఖమ్మం...

పాలేరులో లక్ష్మీకాంత్‌ భాజపాయ్‌ కొండపల్లిలో మండలాధ్యక్షుడి ఇంటికి వెళ్లి, మోర్చా సమావేశాలు నిర్వహించారు. వైరాలో రమీలా బెన్‌బారా గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కొత్తగూడెంలో చత్తీస్‌గఢ్‌ ప్రతిపక్షనేత ధరమ్‌లాల్‌ కౌషక్‌, భద్రాచలంలో ఎంపీ జుబల్‌ ఓరం, ఖమ్మంలో ఎంపీ గోపాల్‌ కిషన్‌ అగర్వాల్‌ పర్యటించారు.

నల్గొండలో..

సూర్యాపేటలో ఎంపీ వీకే సింగ్‌ పాల్గొని, మోదీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. నకిరేకల్‌లో మంత్రి ప్రతిమా భౌమిక్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌...

తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చొప్పదండిలో ఎంపీ వీరేంద్ర ఖతీక్‌ అన్నారు. తెరాస రజాకార్ల పార్టీ అని కోరుట్లలో సీనియర్‌ నాయకుడు అనిల్‌బన్‌ గంగూలీ విమర్శించారు. ధర్మపురిలో ఎంపీ శ్రీపాద్‌, కరీంనగర్‌లో రాజస్థాన్‌ అధ్యక్షుడు సతీష్‌కున్యా, వేములవాడలో ఎంపీ కృష్ణపాల్‌ గుజ్జార్‌ పర్యటించారు.

వరంగల్‌...

భూపాలపల్లిలో దిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అదీష్‌కుమార్‌ గుప్తా గణపురం మండలంలోని మహిళామోర్చా కార్యకర్త ఇంట్లో భోజనం చేశారు. ప్రతి బూత్‌ నుంచి 30 మంది కార్యకర్తలు హాజరై ప్రధాని సభను విజయవంతం చేయాలన్నారు. ఒక దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఆర్టికల్‌ 370 రద్దు చేశామని ఝార్ఖండ్‌ మాజీ సీఎం బాబూలాల్‌ మరాండి మహబూబాబాద్‌లో తెలిపారు. ములుగులో ఎంపీ రమేష్‌, నర్సంపేటలో యూపీ మంత్రి అనిల్‌రాజ్‌భర్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు