Ravi Shastri: సరదా సరదాగానే సిక్స్‌లు బాదేస్తాడు.. అదే స్పిన్‌ బౌలింగ్‌లోనైతే..: రవిశాస్త్రి

టీమ్‌ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Published : 07 May 2024 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు శివమ్‌ దూబె (Shivam Dube), యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. ఎంతోమంది పోటీలో ఉన్న ఐపీఎల్‌ 17 సీజన్‌లో చెన్నై తరఫున మిడిల్‌ ఆర్డర్‌లో పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌తో అలరిస్తున్న శివమ్‌ దూబె వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచారు. వీరిద్దరిపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. దూబె సిక్స్‌ల హిట్టింగ్‌తో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోర్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. యశస్వి జైస్వాల్‌ కూడా కీలకంగా మారతాడని అభిప్రాయపడ్డాడు. 

‘‘ఇద్దరు జెంటిల్‌మేన్‌లను మనం గమనించాలి. వారిద్దరూ లెప్ట్ హ్యాండర్లు. ఇద్దరూ మొదటిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతడి గురించి మనందరికీ తెలుసు. ఇంగ్లాండ్‌పై అద్భుతంగా ఆడాడు. టాప్‌ ఆర్డర్‌లో విధ్వంసకర ఆటగాడు. ఈ యువ క్రికెటర్ నిర్భయంగా సూపర్‌ షాట్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడతాడు. మరో ప్లేయర్ శివమ్ దూబె. అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో విధ్వంసకర ఆటతో అలరిస్తాడు. అతడు మ్యాచ్ విన్నర్. సరదాగా సిక్స్‌లు బాదేస్తాడు. స్పిన్ బౌలింగ్‌నైతే ఊచకోత కోస్తాడు. అతడి పవర్‌ఫుల్ షాట్లకు వెస్టిండీస్‌లో కొన్ని బంతులు స్టేడియం అవతల పడటం పక్కా. దూబె చాలా బలంగా, దూరంగా సిక్సర్లు బాదుతాడు. ఫాస్ట్ బౌలింగ్‌నూ సమర్థవంతంగా ఎదుర్కోగలడు. ఐదు, ఆరో స్థానాల్లో వస్తాడని భావిస్తున్నాను. ఒకవేళ జట్టు కష్టాల్లో ఉంటే 20-25 బంతుల్లో మ్యాచ్‌ మూమెంట్‌ను మార్చేస్తాడు’’ అని దూబెపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు