63 ఎకరాలు కియాకే ఇచ్చారా?

పెనుకొండలో కియా సైంటిఫిక్‌ ప్రాసెసింగ్‌ పేరుతో కేటాయించిన 63 ఎకరాల స్థలం ఎవరికిచ్చారో చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 02 Jul 2022 05:11 IST

గోప్యతపై అనుమానాలకు తావిస్తోంది

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: పెనుకొండలో కియా సైంటిఫిక్‌ ప్రాసెసింగ్‌ పేరుతో కేటాయించిన 63 ఎకరాల స్థలం ఎవరికిచ్చారో చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ భూముల విషయంలో ఎందుకు గోప్యం పాటిస్తున్నారో చెప్పాలన్నారు. ఇదంతా చూస్తుంటే.. కియా సైంటిఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, కియా మోటార్స్‌ రెండూ ఒకటేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఆటోమోటివ్‌ అయిన కియాకి.. సైంటిఫిక్‌ ప్రాసెస్‌ యూనిట్‌తో ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టాలన్నారు. వైకాపా నాయకులు చెబుతున్నట్టు రాష్ట్రంలో నిజంగా అద్భుత పాలన ఉంటే పరిశ్రమలు క్యూ కట్టి ఉండేవని.. కానీ యువతకు ఉన్న ఉపాధి వనరులు కూడా ఎందుకు దూరమవుతున్నాయని మనోహర్‌ ప్రశ్నించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఎవరికైనా ఉపాధి కల్పించారా? మీ పాలనలో ఉన్న ఉపాధి అవకాశాలే పోయాయి. వైకాపా పాలనలో పారదర్శకత లేకపోవడం వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం..
రాష్ట్రంలోని రహదారుల నిర్మాణాన్ని జులై 15లోగా పూర్తిచేసి వాటి ఫొటోలు చూపించమంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని, ఆ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని మనోహర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి చెప్పిన తేదీ నుంచే జనసేన ఆధ్వర్యంలో రహదారుల దుస్థితి ఎలా ఉందో సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తామన్నారు. ముఖ్యమంత్రికి కూడా వాటిని ట్యాగ్‌ చేస్తామని మనోహర్‌ తెలిపారు. అమరావతి నిర్మాణం చేపట్టలేనప్పుడు ఆ భూములను అమ్ముకునే హక్కు జగన్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదంటూ ముఖ్యమంత్రి అసత్యాలు చెబుతున్నారని, ఆయన సొంత అమ్మమ్మ ఊరిలోనూ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ‘ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం భరోసా ఇచ్చేందుకే తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ జనవాణి - జనసేన భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మూడు ఆడిటోరియాలను చూశాం. కానీ.. వాటిని ఇవ్వడానికి నిర్వాహకులు నిరాకరించారు’ అని మనోహర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని