Updated : 06 Aug 2022 06:08 IST

Komatireddy Venkat reddy: నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం

కాంగ్రెస్‌లోనే పుట్టా... అందులోనే ఉంటా..
వరద సహాయం గురించే అమిత్‌ షాను కలిశా
రేవంత్‌రెడ్డి తీరుతోనే పలువురి రాజీనామాలు
ఇక ఆయన ముఖం చూడను
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుతో అనేక మంది పార్టీని వదిలి వెళ్తున్నారని, దాసోజు శ్రావణ్‌ కూడా అందుకే రాజీనామా చేశారని అన్నారు. తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని, అందులోనే ఉంటానని తెలిపారు. భాజపాలోకి వెళ్లనని.. వెళ్తే, చెప్పే వెళ్తానని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన శుక్రవారం కలిశారు. అనంతరం తన నివాసంలో విలేకరుల సమావేశంలో, విడిగా కొన్ని ఛానళ్ల వారితో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనకు చెప్పకుండా తన నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి సుధాకర్‌ ప్రయత్నించారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుని వ్యవహార శైలిని ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు చూస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలంటూ సూచించారు. ఇక ముందు ఆయన గురించి మాట్లాడనని ఆయన ముఖం కూడా చూడదల్చుకోలేదని అన్నారు.  గోదావరి వరదలతో రూ.1,400 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినందున.. ఆ మొత్తాన్ని విడుదల చేయాలని, క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని షాను కోరినట్లు చెప్పారు.  బీబీనగర్‌ ఎయిమ్స్‌తో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులపై ప్రధానిని, కేంద్ర మంత్రులను తాను కలిసినన్నిసార్లు ఎవరూ కలవలేదన్నారు. మునుగోడు సమావేశానికి హాజరుపై ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే పెట్టారన్నారు. హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రకటించిన చాలారోజులకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏముందని వెంటనే మునుగోడుకు వెళ్లారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా నిలిపి, ఓట్లు చీల్చి భాజపా అభ్యర్థి గెలుపునకు పని చేశారన్నారు.  ఈ వివాదాలపై సోనియా, రాహుల్‌ గాంధీల దగ్గర తేల్చుకుంటానన్నారు. మునుగోడు ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్‌గా వెళ్తారా అని ప్రశ్నించగా 30 ఏళ్లుగా ఉన్న తనకు స్టార్‌ క్యాంపెయినర్‌... మూడేళ్ల కింద వచ్చిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ, మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, మీరూ చూస్తారని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు తాము దుఃఖిస్తుంటే ఆయన పావురాలగుట్టపై పావురమై పోయాడని రేవంత్‌ విమర్శించారని మండిపడ్డారు. అందరినీ వెళ్లగొట్టి పాత తెదేపా వాళ్లను తెచ్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్‌ అలీ, రెండు డిగ్రీలు ఎక్కువ ఎండగొడితే తట్టుకోలేని వృద్ధులే రేవంత్‌రెడ్డి పక్కన ఉన్నారన్నారు. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలు ఎప్పుడైనా పీసీసీ అధ్యక్షుని పక్కన కనిపించారా? అని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts