సింగరేణిని బహుళజాతి సంస్థకు అమ్మే కుట్ర

జాతీయవాదం ముసుగులో భాజపా పాలకులు సింగరేణితో పాటు దేశాన్ని బహుళ జాతి సంస్థలకు విక్రయించే కుట్ర చేస్తున్నారని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ సృష్టించిన సంపదను భాజపా నాశనం చేస్తోందని ఆగ్రహం

Published : 11 Aug 2022 06:11 IST

 భాజపా పాలనపై మండిపడ్డ భట్టి

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: జాతీయవాదం ముసుగులో భాజపా పాలకులు సింగరేణితో పాటు దేశాన్ని బహుళ జాతి సంస్థలకు విక్రయించే కుట్ర చేస్తున్నారని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ సృష్టించిన సంపదను భాజపా నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యకం చేశారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియాలను అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. 5జీ సేవలను తన స్నేహితుడు అంబానీకి ధారాదత్తం చేయడానికి మోదీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆజాదీ కా గౌరవ్‌ యాత్ర’ రెండోరోజు బుధవారం ఖమ్మంలో కొనసాగింది. మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి భట్టివిక్రమార్క ఖమ్మం నగరంలో పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం కాల్వొడ్డులో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మయూరి సెంటర్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, వైరారోడ్డు మీదుగా ఇందిరానగర్‌ కాలనీ వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్ల వరకు ఆరెస్సెస్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయలేదని విమర్శించారు. వారి వారసులైన భాజపా నాయకులు అమృత్‌ మహోత్సవాల పేరుతో ప్రచారార్భాటం చేయడం సిగ్గుచేటన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే వారసులు జాతీయవాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అభిప్రాయభేదాలు లేవని భట్టి అన్నారు. మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోట అని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, భట్టి సతీమణి మల్లు నందిని తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts