ప్రతిపక్షాలను ఏకం చేస్తాం

‘ఇప్పటికే చాలాసార్లు చెప్పా. బిహార్‌కు సేవలందించడమే నా లక్ష్యం. ప్రధాని కావాలన్న ఆశ లేదు. చాలా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. కేంద్రంలో పాలక ఎన్డీయేపై పోరుకు ప్రతిపక్షాలను ఏకం చేయడంలో సానుకూల పాత్ర పోషిస్తా. రాబోయే రోజుల్లో

Published : 13 Aug 2022 04:59 IST

బిహార్‌ సీఎం నీతీశ్‌

పట్నా, దిల్లీ: ‘ఇప్పటికే చాలాసార్లు చెప్పా. బిహార్‌కు సేవలందించడమే నా లక్ష్యం. ప్రధాని కావాలన్న ఆశ లేదు. చాలా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. కేంద్రంలో పాలక ఎన్డీయేపై పోరుకు ప్రతిపక్షాలను ఏకం చేయడంలో సానుకూల పాత్ర పోషిస్తా. రాబోయే రోజుల్లో అది మీరే చూస్తారు’ అని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ శుక్రవారం మీడియాతో అన్నారు. బిహార్‌ ప్రజలు మిమ్మల్ని ప్రధానిగా చూడాలని అనుకొంటున్నారా? అన్న ప్రశ్నకు రెండు చేతులూ జోడిస్తూ నీతీశ్‌ పైవిధంగా స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఓ అలవాటుగా మారిందని, కొత్తగా ఏర్పడిన బిహార్‌ సర్కారుకు అలాంటి భయాలు లేవన్నారు.  

4 మంత్రి పదవులు అడిగితే మోదీ ఇవ్వలేదు

‘ఎన్డీయే భాగస్వామిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాకు 16 స్థానాలు వచ్చాయి. మంత్రివర్గంలో నాలుగు స్థానాలు అడిగితే కుదరదన్నారు. అందుకే ప్రభుత్వంలో చేరకూడదన్న నిర్ణయాన్ని జేడీయూ తీసుకోవాల్సి వచ్చింది’ అంటూ నీతీశ్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలో భాజపాతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీతీశ్‌.. మోదీ సర్కారుతో అసలు వివాదం ఎక్కడ మొదలైందన్న వివరాలు బయటపెట్టారు. తన మాజీ సహచరుడైన ఆర్సీపీ సింగ్‌ను గతేడాది మంత్రివర్గంలో తీసుకొంటున్న విషయం కూడా తనకు చెప్పలేదన్నారు. ‘రాష్ట్రంలో 17 స్థానాలు వచ్చిన బీజేపీకి అయిదు మంత్రి పదవులు దక్కినపుడు అంతకంటే ఒక్కటి తగ్గిన మాకు నాలుగు స్థానాలైనా కేటాయించకపోతే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుంది’ అని వివరించారు. ఆర్సీపీ సింగ్‌ను తన సమ్మతితోనే మంత్రివర్గంలోకి తీసుకున్నారన్న భాజపా నేతల ప్రచారం వాస్తవం కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని