రైతు పాదయాత్రపై వ్యతిరేకతకు వైకాపా కసరత్తు

అమరావతి రైతుల మహాపాదయాత్ర విశాఖ చేరుకునేలోగా ఈ యాత్రపై వ్యతిరేక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార వైకాపా సన్నద్ధమవుతోంది. వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే మహాపాదయాత్ర అనే తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వ్యూహం రచిస్తోంది.

Published : 04 Oct 2022 05:26 IST

ఈనాడు, అమరావతి: అమరావతి రైతుల మహాపాదయాత్ర విశాఖ చేరుకునేలోగా ఈ యాత్రపై వ్యతిరేక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార వైకాపా సన్నద్ధమవుతోంది. వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే మహాపాదయాత్ర అనే తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వ్యూహం రచిస్తోంది. దీనికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అంకురార్పణ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వికేంద్రీకరణే ఏకైక మంత్రమని.. మహాపాదయాత్ర తెదేపా, చంద్రబాబు ఆలోచన మాత్రమేనని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచిస్తోంది. ‘అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి వికేంద్రీకరణే మంత్రం. ఇదే రాజకీయ అజెండా కావాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తపన పడేవారందరినీ సమీకరించి ప్రజల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు చేపట్టాలి’ అని వైకాపా అధినాయకత్వం ఆ పార్టీ నేతలు, శ్రేణులకు మార్గనిర్దేశం చేసింది.

తిప్పికొట్టేందుకు సదస్సులు

‘29 గ్రామాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని చేపట్టి దాన్ని ప్రచారం చేస్తున్న తెదేపా, చంద్రబాబు, దోపిడీ అలవాటు పడిన ముఠా చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలి. లేకపోతే వారి ఆలోచనే రాష్ట్రం ఆలోచన అనుకునే అవకాశం ఉంది. దీన్ని మనం సమన్వయంతో తిప్పికొట్టే కార్యక్రమాల్లో భాగంగానే రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాం’ అని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దీనిపై విశాఖపట్నం, కాకినాడలలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. సోమవారం రాజమహేంద్రవరంలోనూ సమావేశం జరిపారు. వికేంద్రీకరణను రాజకీయ ఎజెండాగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తటస్థులు, ప్రజాసంఘాలను ముందుంచి మాట్లాడించాలని వ్యూహం రచిస్తున్నారు. దీనికి మద్దతుగా రాష్ట్ర ప్రజలంతా నిలుస్తున్నారనే వాదాన్ని ఈ సమావేశాల ద్వారా చర్చనీయాంశం చేయాలనే కార్యాచరణను అమలు చేస్తున్నారు. ‘వికేంద్రీకరణపై ప్రజల గొంతుక, అభిప్రాయాలు ప్రతిధ్వనించేలా కార్యక్రమాలు చేపట్టాలి. లేకపోతే అమరావతి అనే కృత్రిమ స్వరమేప్రజలందరి నినాదమనే అవకాశముంది..’ అని నేతలకు సజ్జల ఉద్బోధించినట్లు తెలిసింది.

అమ్మవారి ఆశీస్సుల కోసం పూజలు

వికేంద్రీకరణకు మద్దతుగా అమ్మవారి ఆశీస్సులు కోరేందుకంటూ రాష్ట్రవ్యాప్తంగా దసరా రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టాలని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి కార్యాచరణను సోమవారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని