సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే నిర్ణయం

దసపల్లా భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 04 Oct 2022 06:03 IST

దసపల్లా భూములపై విజయసాయిరెడ్డి

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దసపల్లా భూముల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘సర్వే సంఖ్య 1197, 1196, 1028, 1027ల్లో 82 ఎకరాల దసపల్లా భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి తెదేపా హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా... అప్పటి అడ్వకేట్‌ జనరల్‌ సూచనల మేరకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసపల్లా భూములకు యజమానిగా రాణి కమలాదేవిని నిర్ధారిస్తూ గత ప్రభుత్వ హయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును అమలు చేయడం మినహా మరో గత్యంతరం లేదు. ప్రైవేటు భూముల వ్యవహారంలో మా ప్రభుత్వ, పార్టీ ప్రమేయం ఉందనడం పూర్తిగా సత్యదూరమైన ఆరోపణలు. నాపై, నా కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలూ అవాస్తవం. ఎస్యూర్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్లాట్ల యజమానులు 15 ఎకరాల పరిధిలో 64 మంది ఉన్నారు’ అని అందులో పేర్కొన్నారు.

‘వాణిజ్య అంశాల ఆధారంగానే ఒప్పందం చేసుకున్నాం’

‘వాణిజ్యపరమైన అంశాల ఆధారంగానే రాణి కమలాదేవి ఆధీనంలో ఉన్న దసపల్లా భూములపై ఎస్యూర్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నాం. రాజకీయ నాయకులను ఎన్నడూ సంప్రదించలేదు’ అని మండవ రాఘవేంద్రరావు, వేములపల్లి కోటేశ్వరరావు, వేములపల్లి సందీప్‌, చల్లా వీరరాఘవులు, దాట్ల సుబ్బరాజు, జాస్తి శరత్‌బాబు ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఒప్పందంతో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నారు.


న్యాయపోరాటం చేస్తాం: తెదేపా

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దసపల్లా భూములపై న్యాయ పోరాటం చేయాలని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం విశాఖలో పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు కె.వి.స్వామి ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని