దీక్షాదివస్‌ చిరస్మరణీయం

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ‘తెలంగాణ తెచ్చుడో.. నేను చచ్చుడో’ నినాదంతో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగిన 2009 నవంబరు 29.. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 04:07 IST

నవంబరు 29.. చరిత్రలో నిలిచిపోయిన రోజు: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ‘తెలంగాణ తెచ్చుడో.. నేను చచ్చుడో’ నినాదంతో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగిన 2009 నవంబరు 29.. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘మీ పోరాటం అనితర సాధ్యం. ఒక నవశకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేల్కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు.. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన దీక్షా దివస్‌ ఇది’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 13 సంవత్సరాల క్రితం తనకు లభించిన గౌరవ బ్యాడ్జ్‌ ఇదేనంటూ తనపై నమోదైన కేసు ప్రతిని, తనను అరెస్టు చేసి వరంగల్‌ సెంట్రల్‌జైలుకు తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కేటీఆర్‌ తన ట్వీట్‌కు జత చేశారు.

ప్రాణాలను పణంగా పెట్టి...

ప్రాణాలను పణంగా పెట్టి సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబరు 29.. చారిత్రక దినమని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన ఉద్యమ నేత కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటారు. ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్ఫూర్తితో స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాల ప్రజలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గడంతో పాటు రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేల మంది యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని కవిత విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్‌ వేడుకలు

తెలంగాణ సాధన కోసం 2009లో నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆధ్వర్యంలో దీక్షాదివస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు దీక్షాదివస్‌ను జరిపారు. జిల్లా, మండల, పురపాలక కేంద్రాల్లో, గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని