రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక స్థితికి జగన్‌, బుగ్గనలే కారణం

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక అత్యయిక పరిస్థితికి దిగజారడానికి సీఎం జగన్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలే కారణమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.

Published : 01 Dec 2022 05:19 IST

ఆర్బీఐ అప్పుల పట్టికలో దేశంలో అగ్రస్థానానికి చేరిన ఏపీ
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక అత్యయిక పరిస్థితికి దిగజారడానికి సీఎం జగన్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలే కారణమని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ వేలం ద్వారా ఆర్‌బీఐ నుంచి అత్యధిక అప్పు తీసుకున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, రూ.1500 కోట్ల కొత్త రుణంతో మహారాష్ట్రను దాటిపోయిందన్నారు. మొదటి ఎనిమిది నెలల్లోనే ఏడాది మొత్తానికి చేయాల్సిన రుణాన్ని మించి 101.6 శాతం అప్పులు ఒక్క ఆర్బీఐ నుంచే తీసుకున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్‌ ఒకటి నుంచి నవంబరు 29 వరకు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.45,303 కోట్లు అప్పులు తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి ఏపీ చేసినంత అప్పు దేశంలో మరే రాష్ట్రం చేయలేదు. దేశంలో అత్యధిక స్థూల ఉత్పత్తి ఉన్న మహారాష్ట్ర రూ.45 వేల కోట్లు తీసుకోగా ఏపీ దాన్ని మించి తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు వారికి ఉన్న అప్పుల పరిమితిలో 59.3, 51.2 శాతం మాత్రమే వినియోగించుకున్నాయి. కర్ణాటక 20.9 శాతం తీసుకుంది. వెనకపడిన రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గడ్‌, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపురలు ఆర్బీఐ నుంచి ఒక్క రూపాయి అప్పు తీసుకోలేదు. దిల్లీలో రుణాల కోసం తిరుగుతూ, అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే రాజేంద్రనాథ్‌రెడ్డి దీనిపై ప్రజలకేం చెబుతారు? ఈ మొత్తం అప్పులు భవిష్యత్తు తరాలకు మోయలేని భారంగా మారడం ఖాయం’ అని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు.

బస్సులకు కాపలా కాయడం బోధనేతరం కాదా? : లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సీఎం జగన్‌ పర్యటన ఉంటే విద్యార్థులను తరలించే బస్సులకు ఉపాధ్యాయులు కాపలా కాయడం బోధనేతరం కాదా? అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘‘ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా? మద్యం షాపుల ముందు కాపలాకు, మరుగుదొడ్ల ఫొటోలు తియ్యడానికి, సీఎం పర్యటనల్లో బస్సుల కాపలాకి పనికొస్తారా?’’ అని బుధవారం ట్వీట్‌ చేశారు. జగన్‌ మదనపల్లి సభకు బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.

ఇదేనా సామాజిక న్యాయం?: సయ్యద్‌రఫీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నామినేటెడ్‌ పోస్టులు, ఉన్నతాధికారులుగా సొంత సామాజికవర్గాన్ని, కడప జిల్లా వారిని నియమించడమే సీఎం జగన్‌ సామాజిక న్యాయమా? అని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ ధ్వజమెత్తారు. తితిదే ఛైర్మన్‌, సలహాదారులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, పోలీస్‌ శాఖలోని కీలక పదవులను తన వర్గానికే జగన్‌రెడ్డి కట్టబెట్టారని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చి, వారిపై పెత్తనాన్ని రెడ్లకు కట్టబెట్టారు. సీనియారిటీ లిస్టులో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీ పదవి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? నిధులు, విధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి అధ్యక్షులు, ఛైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. తెదేపా హయాంలో ఓ సామాజికవర్గానికి చెందిన 30 మందిని డీఎస్పీలుగా నియమించారని అసత్యాలు ప్రచారం చేశారు. నిబంధనల పేరుతో లక్షల మందికి విద్యాదీవెన వర్తించకుండా చేశారు...’’ అని సయ్యద్‌రఫీ పేర్కొన్నారు.

ఎన్నికల విధుల్లో కీలకం: భూమిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారిని ఆ విధులకు దూరంగా ఉంచాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించడం తగదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘జగన్‌రెడ్డికి ఉపాధ్యాయులంటే భయం పట్టుకొంది. పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల దగ్గర పెట్టడం, మరుగుదొడ్లు ఫొటోలు తీయడం బోధనేతరం కాదా...’’ అని బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు.

మరుగుదొడ్ల ఫొటోలు తీయడం బోధనేతరం కాదా?: ఏఎస్‌ రామకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మరుగుదొడ్ల ఫొటోలు తీయడం, మద్యం దుకాణాల ముందు ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టడం బోధనేతరం కాదా? అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల విధులను బోధనేతర విధులుగా పరిగణించి, ఉపాధ్యాయులను వాటికి దూరంగా పెట్టడం జగన్‌రెడ్డి భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాడు-నేడు పేరుతో ఇన్నాళ్ల నుంచీ ఉపాధ్యాయులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి? అదనపు తరగతి గదుల నిర్మాణ పర్యవేక్షణ, కమాండ్‌ కంట్రోల్‌ నిర్వహణ లాంటి పనులను ప్రభుత్వం ఏమని భావిస్తోంది? ప్రభుత్వ యాప్‌లు నిర్వహించాలని వారిపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఈ పనుల నుంచి కూడా వారిని తప్పించాలి. ఉపాధ్యాయులు ఎన్నికల విధులు, జనగణనలో పాలుపంచుకునే ప్రక్రియ చాలా కాలం నుంచీ వస్తుంది. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే అక్కసుతోనే జగన్‌ ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగ వినాశనమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు...’’ అని ఏఎస్‌ రామకృష్ణ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని