7వ సారీ ఎలా సాధ్యమైంది!

1990దాకా కాంగ్రెస్‌ కంచుకోటగా సాగిన గుజరాత్‌ ఆ తర్వాతి నుంచి భాజపా చేతుల్లోకి వెళ్లింది. నరేంద్రమోదీ రాకతో ఆ రాష్ట్రం కమలనాథుల ప్రయోగశాలగా మారింది.

Updated : 09 Dec 2022 07:32 IST

పార్టీ, ప్రభుత్వ పరంగా కమలదళం వ్యూహాత్మక అడుగులు

గుజరాత్‌లో భాజపా విజయ పరంపరకు కారణాలివే

అహ్మదాబాద్‌ నుంచి నీరేంద్రదేవ్‌

రెండోసారి అధికారం నిలబెట్టుకోవటానికే పార్టీలు అష్టకష్టాలు పడుతున్న వేళ... భాజపా గుజరాత్‌లో అప్రతిహతంగా ఎలా నెగ్గగలుగుతోంది? నరేంద్ర మోదీ, అమిత్‌ షాలాంటి నేతలు కేంద్రానికి వెళ్లాక కూడా ఆ పార్టీ ప్రభ మరింత పెరగటానికి కారణాలేంటి? కమల దళం తిరుగులేని శక్తిగా ఎదగటానికి, ఏడోసారీ విజయం సాధించటానికి దోహదం చేసిన కారణాలను చూస్తే....

1990దాకా కాంగ్రెస్‌ కంచుకోటగా సాగిన గుజరాత్‌ ఆ తర్వాతి నుంచి భాజపా చేతుల్లోకి వెళ్లింది. నరేంద్రమోదీ రాకతో ఆ రాష్ట్రం కమలనాథుల ప్రయోగశాలగా మారింది. మోదీ పేరు ప్రతి ఇంటా బ్రాండుగా మారిపోయింది.

పట్టణాల పట్టం...

1995లో తొలిసారి గుజరాత్‌లో అధికారంలోకి వచ్చిన భాజపా ప్రధానంగా నగరాల అభివృద్ధివైపు దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన నుంచి.. పెట్టుబడులను ఆకర్షించడం దాకా భాజపా పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో పట్టణ ఓటర్లంతా భాజపాకు పెట్టని కోటగా మారిపోయారు.

గోధ్రా మార్చేసింది...

అయోధ్య పరిణామాల అనంతరం భాజపా అధికారంలోకి వచ్చాక 2002, ఫిబ్రవరి 27 జరిగిన గోధ్రా రైలు దహనం గుజరాత్‌ రాజకీయాల్లో ప్రకంపనలు లేపింది. దాని ప్రభావం రాజకీయ సమీకరణాలపై బలంగా పడి రాష్ట్రంలో భాజపా పుంజుకోవటానికి దోహదపడింది.

గ్రామీణ ‘సంఘ’మం...

గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం ఎక్కువ. వారి సాయంతో సంస్థాగతంగా పార్టీ మరింత బలం పుంజుకుంది. కేవలం పట్టణ ఓటర్లను మాత్రమే కాకుండా గ్రామీణ స్థాయి ఓటర్లను కూడా ఆకర్షించడంలో భాజపా సఫలమైంది.

పెట్టుబడుల వరద

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్రంతో పోరాడుతూనే, గుజరాత్‌కు భారీ పెట్టుబడులు తేవటంలో నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఇక కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుజరాత్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మోదీ, అమిత్‌షాల స్వరాష్ట్రం కూడా కావడం పెట్టుబడులకు మరింత ఊతమిస్తోంది.

కఠిన నిర్ణయాలతో...

దిల్లీ, పంజాబ్‌లలో అనూహ్య విజయం సాధించిన ఆప్‌ గుజరాత్‌లో అడుగుపెట్టడంతో భాజపా ఈ సారి ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. కేంద్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్‌, గుజరాత్‌ నాయకులతో ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 150 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. అన్ని వర్గాల ప్రజలను ఒప్పించే బాధ్యతతో ఈ బృందాలు ఎటువంటి హడావుడి లేకుండా తమ పనులు చేసుకొంటూ పోయాయి. వీటన్నింటికి తోడు మోదీ సుడిగాలి ప్రచారాలు కలసి వచ్చాయి.

2017లో రెండంకెల సీట్లకు పరిమితమైన నాడే భాజపా తన పరిస్థితిని బేరీజు వేసుకొని జాగ్రత్త పడుతూ వచ్చింది. ఏమాత్రం మొహమాటాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో కఠిన నిర్ణయాలు తీసుకుంది.

కొవిడ్‌ సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని గుర్తించిన అధిష్ఠానం... ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ సహా మొత్తం కేబినెట్‌పై వేటు వేసింది.

పనితీరు బాగాలేని 42 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లను నిరాకరించడం భాజపా ఇమేజ్‌ను పెంచింది.


సర్వా‘మోదీ’యం!

భాజపాకు గుజరాత్‌ కంచుకోట. ఇందులో సందేహమేమీ లేదు. కానీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పూర్తిగా బాగుందనిగానీ, ఈ దఫా అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమనిగానీ ఎన్నికలకు ముందు ఎవరూ చెప్పలేకపోయారు. ఆ మాటకొస్తే కమలనాథుల్లోనూ ఆ విశ్వాసం సంపూర్ణంగా ఏమీ లేదు! ముఖ్యమంత్రుల మార్పు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, రైతు సమస్యల వంటివి ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతాయేమోనని వారు సందేహించారు. కానీ ప్రధాని మోదీ సమ్మోహన శక్తి ముందు అవేమీ నిలవలేకపోయాయి. ఎన్నికల ప్రచారంలో అన్నీతానై వ్యవహరించిన ఆయన.. గుజరాత్‌లో పార్టీకి ఒంటిచేత్తో విజయం సాధించిపెట్టారు. అవును.. ఇది ముమ్మాటికీ నరేంద్రుడి విజయమే! ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్‌పై మోదీ తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర రాజకీయాలను ‘మోదీకి ముందు, మోదీ తర్వాత’ అన్నంతలా మార్చేశారు! రాష్ట్రంలో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్‌ను తన వ్యూహచతురతతో క్రమంగా బలహీనపర్చారు. ప్రధాని పదవిని చేపట్టి దిల్లీకి తన మకాం మార్చాక కూడా గుజరాత్‌పై ఆయన శ్రద్ధ వీడలేదు. కేంద్రం అమలుచేసే ప్రతి అభివృద్ధి పథకంలో దానికి పెద్దపీట దక్కేలా చూశారు.  

విస్తృత ప్రచారం

తన స్వరాష్ట్రంలో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎంత ప్రతిష్ఠాత్మకమో మోదీకి తెలుసు. అందుకే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. 31 ర్యాలీలు, మూడు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తూనే.. ప్రతిపక్షాలపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. ‘ఈ నరేంద్రుడి రికార్డులను బద్దలుకొట్టే అవకాశాన్ని భూపేంద్రుడికి ఇవ్వండి’ అని ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టిసారించారు. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ప్రధాని తమకు మంచి గుర్తింపు తీసుకొచ్చారన్న భావన స్థానిక గిరిజనుల్లో కనిపించింది.

ఈనాడు ప్రత్యేక విభాగం


భూపేంద్ర ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ

గుజరాత్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. రాష్ట్రంలోని 182 స్థానాలకు గాను 156 భాజపాకే వచ్చాయి. దీంతో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. 12వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని