Updated : 28/11/2021 11:16 IST

పది వేల కోట్లిస్తే.. ప్రతి గింజా కొని చూపిస్తాం

సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌
అదనంగా క్వింటాకు రూ.500 బోనస్‌ కూడా ఇస్తాం
కాంగ్రెస్‌ ‘వరి దీక్ష’లో రేవంత్‌రెడ్డి
మోదీ, కేసీఆర్‌లు వరి రైతులకు ఉరి వేస్తున్నారని ధ్వజం

‘వరి దీక్ష’లో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గాంధీభవన్‌, కవాడిగూడ, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ కలిసి వరి రైతులకు ఉరి వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూ.2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ధాన్యం కొనడానికి రూ.10 వేల కోట్లు వెచ్చించలేరా? అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని స్పష్టంచేశారు. ఆ పని చేయలేకపోతే ప్రజలను ఓట్లు అడగబోమని.. సవాల్‌ను స్వీకరించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌  శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద రెండు రోజుల ‘వరి దీక్ష’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గత 45 రోజులుగా రైతులు ధాన్యంతో కల్లాల్లో ఎదురు చూస్తున్నారు. వరి కుప్పలపైనే ప్రాణాలు వదులుతున్నారు. కేంద్రం తెలంగాణ నుంచి 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తానని చెబితే.. ఇప్పటి వరకు 8 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. ఇదంతా కేసీఆర్‌ సృష్టించిన గందరగోళం. కల్లాల్లో ఉన్న పంట గురించి పక్కనపెట్టి.. యాసంగిపై మాట్లాడుతున్నారు. దిల్లీ వెళ్లి మోదీని కలవకుండానే తిరిగొచ్చారు. తెరాస, భాజపా రెండూ ఒక తాను ముక్కలే. వారు రైతులకు న్యాయం చేయలేరు. దిల్లీ సరిహద్దులో దీక్ష చేసిన రైతులే మాకు ఆదర్శం. ఈ రాత్రికి ధర్నాచౌక్‌లోనే పడుకుంటాం. ఇక్కడ తేలకపోతే పార్లమెంటు సమావేశాల్లో మోదీని నిలదీస్తాం. అసెంబ్లీలో కేసీఆర్‌ సర్కారును గట్టిగా అడుగుతాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

‘వరి దీక్ష’లో రేవంత్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి, చిన్నారెడ్డి, సీతక్క తదితరులు

రైతుల్ని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్‌
పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో రాజకీయాలు చేస్తూ, అబద్ధాలతో, ధన సంపాదనే లక్ష్యంగా కేసీఆర్‌ పని చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఈటల మొదట కాంగ్రెస్‌నే సంప్రదించారని.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆయన భాజపాలో చేరారని వ్యాఖ్యానించారు. నేతలు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, కోదండరెడ్డి, సీతక్క, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కన్నెగంటి రవి, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వరరావు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు.

ఆ ఇద్దరినీ కలిపిన ‘వరి దీక్ష’
‘వరి దీక్ష’ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను కలిపింది. దీక్షలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. రేవంత్‌ పీసీపీ అధ్యక్షుడిగా ఎంపికైన సమయంలో కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు సీనియర్‌ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని