వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమ స్వార్థ రాజకీయాల కోసం స్వరాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలంగాణ భాజపా నాయకులే ...

Published : 15 Jan 2022 05:27 IST

రాజకీయాల కోసం అన్నదాతల ప్రయోజనాలు తాకట్టు
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమ స్వార్థ రాజకీయాల కోసం స్వరాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలంగాణ భాజపా నాయకులే అసలు ద్రోహులన్నారు. సమస్యలను పట్టించుకోకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్న రాష్ట్ర భాజపా నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన కోరారు. దేశ రైతాంగం కేసీఆర్‌ కోసం ఎదురుచూస్తోందని, జాతీయ స్థాయిలో భాజపాపై మరో ఉద్యమానికి నాంది పడుతోందని చెప్పారు. భాజపా వైఖరిని నిరసిస్తూ మంత్రి శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని భాజపా చేసింది శూన్యం. పంటలకు మద్దతు ధరను ప్రకటించడం లేదు. వ్యవసాయ పనిముట్ల ధరలు పెంచి అదనంగా పన్నులు వేసింది. ఎరువుల ధరలు 3 నెలల కాలంలోనే 50-100% వరకు పెంచింది. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతును పూర్తి అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలను తుంగలో తొక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయాన్ని భాజపా రాజకీయ కోణంలో చూస్తోంది. రాజకీయం మాతో చేయండి రైతులతో కాదు అని మా అధినేత కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. అయినా భాజపా కుతంత్రాలు మానడం లేదు. సీఎం కేసీఆర్‌ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి’’ అని ప్రశాంత్‌రెడ్డి డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని