ఈ సీఎంను వదిలిపెట్టం

‘‘ఉద్యోగులను, ఉపాధ్యాయులను గోస పెడుతున్న జీవో 317పై మంత్రివర్గంలో చర్చించకపోవడం దుర్మార్గం. ఆ జీవోను సవరించేవరకు సీఎంను వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టినా, లాఠీలు ఝళిపించినా వారికి మద్దతుగా పోరాడతాం. త్వరలో భాజపా కేంద్ర నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహిస్తారు.

Published : 19 Jan 2022 05:14 IST

జీవో 317ను సవరించేవరకు పోరాడతాం
మంత్రివర్గంలో దీనిపై చర్చించకపోవడం దుర్మార్గం
మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఉద్యోగులను, ఉపాధ్యాయులను గోస పెడుతున్న జీవో 317పై మంత్రివర్గంలో చర్చించకపోవడం దుర్మార్గం. ఆ జీవోను సవరించేవరకు సీఎంను వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టినా, లాఠీలు ఝళిపించినా వారికి మద్దతుగా పోరాడతాం. త్వరలో భాజపా కేంద్ర నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహిస్తారు. ఈ ప్రభుత్వ పతనం ప్రారంభమయింది’’ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. మంగళవారం దృశ్యమాధ్యమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సంక్రాంతి పండగను కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో చేసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రగతిభవన్‌ ముట్టడించారు. జీవో 317ను సవరించాలని వారు ఆందోళనలు చేస్తున్నా సీఎం మనసు కరగడం లేదు. మంత్రివర్గ సమావేశం ఒక టైంపాస్‌ మీటింగ్‌. గంటల తరబడి రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు డ్రామా చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తల్చుకుంటే గతంలో ప్రభుత్వాలే పోయాయి. కేసీఆర్‌ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి.  రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్‌ కమిటీ చెప్పింది. సీఎస్‌, హరీశ్‌రావులతో వేసిన కమిటీలు ఏమయ్యాయి? నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపనకే కమిటీలు వేస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు’’ అని బండి పేర్కొన్నారు.

తెలుగుమాధ్యమానికే ఉపాధ్యాయులు లేరు
ఆంగ్లమాధ్యమం పెడితే మంచిదే.. కానీ తెలుగు మాధ్యమంలో బోధించేందుకే ఉపాధ్యాయులు లేరు. చాలా బడుల్లో బాలికలకు శౌచాలయాలు కూడా లేవు. సీఎం ప్రకటన కార్పొరేట్‌ విద్యా సంస్థల నుంచి పైసలు గుంజేందుకే. ఆయన ఇప్పటివరకు ఒక్క బడినీ సందర్శించలేదు. ప్రధాని సీఎంలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ పాల్గొనలేదు. అంత తీరికలేని షెడ్యూల్‌ ఏముందో ప్రకటించాలి. పంటనష్టం పరిశీలించేందుకు వరంగల్‌ వెళ్తానన్న సీఎం ఎందుకెళ్లలేదో చెప్పాలి. కేంద్రంపై నెపం నెట్టి ప్రతి అంశంపై దాటవేత ధోరణి అవలంబించడం సీఎంకు అలవాటైంది. ఏడేళ్లలో ఒక్క రైతునూ ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. జనవరి 31వ తేదీ వరకు వరి కొనుగోలు పూర్తి చేయాలని చేయాలని కేంద్రం చెప్పింది. మళ్లీ ఈ విషయంలో డ్రామాలు ఆడొద్దు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా ఏడాదిలోనే దేశంలో 158 కోట్ల టీకా డోసులు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ కృషితో ఇప్పటివరకు కరోనాపై విజయం సాధించాం. కొవిడ్‌ కట్టడి విషయంలో సీఎం తీరు విస్మయం కలిగిస్తోంది. ప్రజలు మూడో దశవిషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

భాజపా కార్యాలయం వద్ద అదనపు భద్రత
ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీకి భద్రతాపరమైన ముప్పు అల్టిమేటం దృష్ట్యా కేంద్ర నిఘావర్గాల సూచనలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని భాజపా, ఆరెస్సెస్‌ కార్యాలయాల్లో భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు. మంగళవారం భాజపా కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయం పరిసరాల్లో ఇంటర్‌సెప్టర్‌ వాహనాన్ని ఏర్పాటు చేశామని నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. రాకపోకల్ని నియంత్రించాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం ఏర్పాటు చేయాలని, అదనపు పోలీస్‌ భద్రత కల్పించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయంలో మెటల్‌ డిటెక్టర్‌ ఏర్పాటు చేస్తున్నారని..అన్ని రోజుల్లోనూ కొనసాగించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని