అప్నాదళ్‌, నిషాద్‌ పార్టీలతో భాజపా పొత్తు

భాజపా ప్రభుత్వంలోని మంత్రులను సమాజ్‌వాదీ పార్టీ తనవైపు తిప్పుకొని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ప్రచారంలోకి పెట్టడంతో కమలదళం దానికి కౌంటర్‌ ఇచ్చే

Updated : 20 Jan 2022 05:35 IST

యూపీలో 300 స్థానాలు మావే: జేపీ నడ్డా

ఈనాడు, దిల్లీ: భాజపా ప్రభుత్వంలోని మంత్రులను సమాజ్‌వాదీ పార్టీ తనవైపు తిప్పుకొని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ప్రచారంలోకి పెట్టడంతో కమలదళం దానికి కౌంటర్‌ ఇచ్చే పనిలో పడింది. బలమైన ఓబీసీ వర్గాలు- నిషాద్‌, కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిషాద్‌ పార్టీ; కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌లతో కలిసి రాష్ట్రంలోని 403 సీట్లకు పోటీ చేయనున్నట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించడం దీనికి బలాన్నిస్తోంది. 300 పైగా స్థానాలను కూటమి గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వాములైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పడం ద్వారా ఓబీసీలు చేజారిపోకుండా చూసుకొనే ప్రయత్నాన్ని భాజపా చేసింది. రాష్ట్ర భాజపా నాయకులు, ఈ రెండు పార్టీల నేతలతో సమావేశమైన ఫొటోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్విటర్‌ ద్వారా పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకొంది. ‘ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజల ఆశీర్వాదం ఎన్డీయేకి ఉంది. ఎన్డీయే మిత్రపక్షాలు ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

అఖిలేశ్‌ ఓబీసీ రాజకీయాలకు చెక్‌

సమావేశం తర్వాత నిషాద్‌, అప్నాదళ్‌ నేతల ప్రకటనలను బట్టి వారు సీట్ల పంపిణీపై భాజపాతో అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. నిషాద్‌పార్టీ నేత సంజయ్‌ నిషాద్‌ ఇదివరకు 20 సీట్లు డిమాండ్‌ చేసినప్పటికీ ఇప్పుడు 15 స్థానాల గురించి మాట్లాడుతున్నారు. రెండు పార్టీలకు వాటి సత్తాకు మించి కాస్త ఎక్కువ సీట్లు ఇచ్చి అయినా సమాజ్‌వాదీ ఓబీసీ రాజకీయాలకు చెక్‌ చెప్పి, రిస్కును తగ్గించుకోవాలని భాజపా అగ్రనేతలు యోచిస్తున్నారు. స్వామిప్రసాద్‌ మౌర్య, ధారాసింగ్‌ చౌహాన్‌, ధర్మసింగ్‌ సైనీల నిష్క్రమణ ద్వారా ఓబీసీల్లో తలెత్తిన అనుమానాలను ఈ జట్టు ద్వారా తొలగించాలన్నది భాజపా యోచనగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని