పంజాబీల ఆకాంక్షలు మాకే బాగా తెలుసు

పంజాబ్‌లో ఐదేళ్ల క్రితం కోల్పోయిన అధికార పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అడుగులు వేస్తోంది! పంజాబ్‌ పంజాబీలదేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Updated : 17 Feb 2022 05:22 IST

కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌.. దిల్లీ ఆదేశాలతో పనిచేస్తాయ్‌
కమలదళంతో మళ్లీ కలవబోం
శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ వ్యాఖ్యలు

రాయ్‌కోట్‌: పంజాబ్‌లో ఐదేళ్ల క్రితం కోల్పోయిన అధికార పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) అడుగులు వేస్తోంది! పంజాబ్‌ పంజాబీలదేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఇక్కడి ప్రభుత్వాన్ని నడిపించే పార్టీలకు పట్టం కట్టొద్దని ఓటర్లకు సూచిస్తోంది. తమపై విశ్వాసం ఉంచి మరోసారి అధికారం అప్పగించాలని కోరుతోంది. క్షేత్రస్థాయిలో తమకున్న బలం, మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు కలిసొచ్చి.. ఎన్నికల్లో తాము విజయతీరాలకు చేరుతామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ ‘పీటీఐ’ వార్తాసంస్థ ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. విశేషాలు ఆయన మాటల్లోనే..

మాకు క్షేత్రస్థాయిలో బలముంది

పంజాబ్‌లోని అత్యంత పురాతన పార్టీల్లో ఎస్‌ఏడీ ఒకటి. మాది రైతుల పార్టీ. పంజాబ్‌ కేంద్రంగా పనిచేస్తున్న పంజాబీ పార్టీ ఎస్‌ఏడీ ఒక్కటే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మాకు కార్యకర్తల బలముంది. పంజాబీల ఆకాంక్షలను మా కంటే మెరుగ్గా ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు. దిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పనిచేసే పార్టీ కాదు మాది. రాష్ట్ర ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో తమ సొంత పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఆప్‌- అవకాశవాదులు, ఫిరాయింపుదారులతో నిండిన పార్టీ. భాజపా, కాంగ్రెస్‌ల తరహాలోనే అది కూడా దిల్లీ నుంచి వచ్చే ఆదేశానుసారం పనిచేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు గెల్చుకున్నప్పటికీ.. రాష్ట్రంలో ఆ తర్వాత ఆప్‌ నిర్వీర్యమైంది. ఇక కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ క్షీణిస్తూనే ఉంది.

బీఎస్పీ మెరుగైన మిత్రపక్షం

భాజపాతో పోలిస్తే బీఎస్పీ చాలా మెరుగైన మిత్రపక్షం. రాష్ట్రంలో కమలదళం కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీకి బలముంది. పంజాబ్‌ ఐక్యత, ప్రయోజనాల కోసమే గతంలో మేం భాజపాతో చేతులు కలిపాం. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తమే తర్వాత ఆ పార్టీతో బంధానికి ముగింపు పలికాం. ఈ ఎన్నికల్లో కమలనాథులకు చెప్పుకోదగ్గ సీట్లు దక్కే అవకాశాల్లేనే లేవు. వారితో ఎన్నికల తర్వాత మేం జట్టు కట్టబోం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని