బయ్యారం ఉక్కు రాష్ట్రం హక్కు కాదా?

బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్రం ముందుకు రావడం లేదని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 21 Feb 2022 04:22 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది అవగాహన రాహిత్యం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్రం ముందుకు రావడం లేదని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర హక్కులు సాధించాల్సింది పోయి చిక్కులున్నాయంటూ ఉక్కు కర్మాగారంపై చేతులేత్తేయడం సిగ్గుచేటంటూ ధ్వజమెత్తారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌కి ఆదివారం కేటీఆర్‌ లేఖ రాశారు. ‘‘బయ్యారంలో ఉక్కు కర్మాగారం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన హామీ. నిండు పార్లమెంట్‌లో భారత ప్రభుత్వం ఒప్పుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు అటకెక్కించింది. ఉద్దేశపూర్వంగానే ఈ హామీని పట్టించుకోవడం లేదు. సుమారు 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల అపార ఇనుప ఖనిజం నిల్వలు బయ్యారంలో ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక నిర్ధారించింది. అవేమీ లేవని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతోంది.

బయ్యారంలో సరిపడా నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణమైతే.. ప్రత్యామ్నాయంగా, కేవలం 180 కిలోమీటర్ల దూరంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భైలదిల్లాలో గనులు కేటాయించవచ్చు. అక్కడి నుంచి పైపులైన్‌ లేదా రైల్వేలైన్‌ వేస్తే సరిపోతుందని సీఎం కేసీఆర్‌... ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. నేను పలుమార్లు కేంద్రమంత్రులను కలిసినా స్పందన కరవైంది. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయని ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతుంటే... ప్రభుత్వంలో భాగస్వామి అయిన కిషన్‌రెడ్డి అలా మాట్లాడటం తగదు. గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేల మంది గిరిజన, ఆదివాసీ యువకుల ఉపాధి ఆశలను ఆవిరి చేస్తూ వేల ఉద్యోగాలకు ఆయన ఉరి వేశారు. ఇకనైనా కేంద్రం బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకోవాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని