Updated : 22 May 2022 05:23 IST

రచ్చబండకు కాంగ్రెస్‌ శ్రీకారం

అక్కంపేటలో ప్రారంభించిన రేవంత్‌

వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై ప్రచారం

జయశంకర్‌ సొంతూరినీ కేసీఆర్‌ అభివృద్ధి చేయలేదని ధ్వజం

వేర్వేరు చోట్ల సీఎల్పీ నేత భట్టి, ఉత్తమ్‌, ఇతర నేతల హాజరు

ఈనాడు-వరంగల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే-ఆత్మకూరు, కందుకూరు, తిమ్మాపూర్‌: ‘‘తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని జయశంకర్‌ సార్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన పేరును వాడుకున్న కేసీఆర్‌.. సార్‌ సొంతూరును కూడా అభివృద్ధి చేయలేదు’’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో రచ్చబండను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం నిర్వహించారు. ధరణి రద్దు, పటిష్ఠమైన రెవెన్యూ వ్యవస్థ రూపకల్పన, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు రూ.15 వేల సాయంతోపాటు పలు కీలకమైన హామీలను ప్రజల ముందుంచారు. రైతులతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. జయశంకర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఆచార్య జయశంకర్‌ స్వగ్రామమైన అక్కంపేటను కనీసం రెవెన్యూ గ్రామంగా మార్చలేదు. ఒక్క రెండు పడకగదుల ఇల్లూ ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ అమలు కావడం లేదు. జయశంకర్‌ పేరు కాలగర్భంలో కలవాలని కేసీఆర్‌ చూస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అక్కంపేటను దత్తత తీసుకుని.. అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని పలువురు దళితుల ఇళ్లకు వెళ్లి సమస్యలను రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. హేమలత అనే మహిళపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. దళితులైన జాన్‌, లతల ఇంట్లో భోజనం చేశారు. వరంగల్‌లో భూసమీకరణ పేరుతో రైతుల స్థలాలను లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు. గీసుకొండ మండలం కొత్తపేటలో రైతులను కలిసి మద్దతు పలికారు.

ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం: భట్టి
2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడారు. తెరాస రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అమ్మహస్తం పథకం ద్వారా రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు 9 నిత్యావసర సరకుల పంపిణీని పునరుద్ధరిస్తామన్నారు. రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.5 వేలతో పాటు భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లా దొండపాడులో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగిత్యాల జిల్లా పొలాసలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జనగామ జిల్లా కొమురవెళ్లిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కరీంనగర్‌ జిల్లా నగునూర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కామారెడ్డి జిల్లా గూడెంశాబ్దిపూర్‌లో మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌లు రచ్చబండలో పాల్గొన్నారు.

కరీంనగర్‌ జిల్లాలో తోపులాట
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని మొగిళిపాలెం గ్రామంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలను పలువురు నిలదీయడంతో రసాభాసగా మారింది. తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని