IPL 2024 - Sanju Samson: సంజూ క్యాచ్‌ ఔట్ వివాదం.. ఫీల్డర్‌ రెండుసార్లు రోప్‌ను తాకాడన్న సిద్ధూ!

క్యాచ్‌ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. 

Updated : 08 May 2024 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ చివరి దశకు చేరుకుంటున్న వేళ అంపైరింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బౌండరీ లైన్‌ వద్ద దిల్లీ ఫీల్డర్‌ షై హోప్‌ క్యాచ్‌పై థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బౌండరీ లైన్‌ రోప్‌ను ఫీల్డర్‌ తాకినట్లు రిప్లేలో కనిపిస్తున్నా ఔట్‌గా ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేగాయి. తాజాగా ఈ ఘటనపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సిద్ధూ స్పందించాడు. క్యాచ్‌ సమయంలో ఫీల్డర్‌ రెండుసార్లు బౌండరీ రోప్‌ను తాకాడని వ్యాఖ్యానించాడు. 

‘‘దిల్లీ విజయానికి ప్రధాన కారణం సంజూ శాంసన్‌ ఔట్‌ నిర్ణయం. క్యాచ్‌పై ఒక్కోరిది ఒక్కో అభిప్రాయం. అయితే సైడ్‌ యాంగిల్‌ నుంచి చూస్తే బౌండరీ రోప్‌ను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం లేదా? అనే అనుమానాలు వస్తాయి. ఒకవేళ సాంకేతికతను వాడినా పొరపాటు వచ్చి ఉండొచ్చు. పాలల్లో ఈగ పడటం చూసిన మిమ్మల్ని వాటిని తాగమని ఎవరైనా చెబితే ఎలా ఉంటుందో.. మ్యాచ్‌లో రాజస్థాన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకసారి కాదు.. రెండుసార్లు ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తోంది. అయినా సరే, ఎవరైనా ఇది ఔట్‌ అని బలంగా వాదిస్తే మాత్రం.. తటస్థ వ్యక్తిగా నేను కూడా కోహ్లీ నోబాల్ వివాదంపై మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి, నిబంధనలు ఎలా ఉన్నా.. మన కళ్లు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆధారాలు బలంగా ఉన్నప్పుడు వాటిని నమ్మాలి. అయితే, అంపైర్‌ కావాలనే ఇలా చేశాడని అనలేం. గేమ్‌లో ఇవన్నీ సహజమే. ఎవరినీ తప్పు బట్టలేం. అయితే, మ్యాచ్‌ స్వరూపాన్ని మాత్రం మార్చేసిందని చెప్పగలను’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. 

మరిన్ని కోణాల్లో చూస్తే బాగుండేది: కోలింగ్‌వుడ్

‘‘మైకెల్ గాఫ్‌ (థర్డ్‌ అంపైర్) నాకు చాలా మంచి స్నేహితుడు. నేను అతడికి మద్దతుగా ఉండాలి. అయితే, క్యాచ్‌కు సంబంధించి మరికొన్ని కోణాల్లో చూసి ఉంటే బాగుండేది. బౌండరీ లైన్‌కు చాలా దగ్గరగా ఉందనిపించింది. ఇలాంటి నిర్ణయాలు కీలక సమయంలో తీసుకుంటే మ్యాచ్‌పై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే, ఇంకాస్త సమయం తీసుకుని నిర్ణయం వెల్లడిస్తే ఇంత దుమారం ఉండేది కాదు. ఐపీఎల్‌లో ప్రతిదీ వేగంగా జరిగిపోవాలని నిర్వాహకులు అనుకొని ఉంటారు. అందులో భాగంగా అంపైర్లు త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పాల్ కోలింగ్‌వుడ్‌ తెలిపాడు.  

దిల్లీ ఫ్రాంచైజీ స్పందన.. 

కీలకమైన సంజూ శాంసన్‌ వికెట్‌ను తీసుకోవడంతో మ్యాచ్‌ దిల్లీ వైపు మళ్లింది. చివరికి 20 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో కొనసాగుతోంది. శాంసన్‌ క్యాచ్‌ నిర్ణయం వివాదాస్పదం కావడంతో దిల్లీ ఫ్రాంచైజీ కూడా స్పందించింది. ‘షై హోప్‌ బంతిని పట్టుకున్నాడు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చి ఓ ఫొటోను పోస్టు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు