Sanju Samson: క్యాచ్‌పై అంపైర్‌తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా

ఔట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్‌తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది.

Updated : 08 May 2024 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్ (86) అద్భుతంగా పోరాడాడు. అయితే, వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్‌ ఓటమి తప్పలేదు. అంపైర్‌తో వాగ్వాదం చేయడంతో ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ సంజూ శాంసన్‌కు (Sanju Samson) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది. ‘‘రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూపై మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం జరిమానా విధిస్తున్నాం. ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఫైన్‌ పడింది. ఆర్టికల్ 2.8 లెవల్‌ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకు జరిమానా విధించడం జరిగింది’’ అని కమిటీ వెల్లడించింది. 

మ్యాచ్‌ మా చేతుల్లోనే ఉందనుకున్నాం: సంజూ

‘‘ఓవర్‌కు 11-12 పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. మ్యాచ్‌ ఎక్కువ భాగం మా చేతుల్లోనే ఉందని భావించాం. అయితే, ఐపీఎల్‌లో ఏ క్షణంలోనైనా పరిస్థితులు మారిపోతుంటాయి. దిల్లీ బ్యాటర్లు జేక్ ఫ్రేజర్, అభిషేక్ దూకుడుగా ఆడారు. కొన్ని పరుగులను నియంత్రిస్తే బాగుండేది. కానీ, వారిద్దరు మాకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టారు. అయితే, ఓపెనర్లను ఔట్ చేసిన తర్వాత మళ్లీ పుంజుకొని దిల్లీని అడ్డుకోగలిగాం. చివర్లో స్టబ్స్‌ భారీ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సందీప్‌ బౌలింగ్‌లో బౌండరీలు రాబట్టడం చాలా కష్టం. అలాంటిది స్టబ్స్ సిక్స్‌లు కొట్టాడు. గత మూడు మ్యాచులు కూడా చివరి వరకూ వచ్చాయి. రెండింట్లో ఓడిపోయాం. పొరబాట్ల నుంచి నేర్చుకొని మున్ముందు మ్యాచుల్లో బరిలోకి దిగుతాం’’ అని రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ తెలిపాడు. 

అసలేమైందంటే?

ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు షార్ట్‌ పిచ్‌ బంతిని లాంగాన్‌ వైపు సిక్సర్‌ బాదేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌ వద్ద హోప్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టాక అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును దాదాపుగా తాకినట్లే రీప్లేలో కనిపించింది. షూకి, బౌండరీ హద్దుకు మధ్య ఖాళీ కనిపించలేదు. కానీ రీప్లే పరిశీలించాక మూడో అంపైర్‌ ఔటిచ్చాడు. బంతి బౌండరీ లైన్‌ తాకిందనడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. సంతృప్తి చెందని శాంసన్‌ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. అప్పటికి రాజస్థాన్‌ స్కోరు 162 పరుగులు. 26 బంతుల్లో 60 రన్స్ చేయాల్సి ఉంది. చివరికి రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని