AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కొట్టేసిన క్యాట్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను క్యాట్‌ కొట్టి వేసింది.

Updated : 08 May 2024 16:35 IST

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కొట్టి వేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని, సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించిగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. రెండోసారి సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని