Hyderabad vs Lucknow: ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్‌’లో వరుణుడు ఏం చేసేనో?

హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్‌ వచ్చేస్తోంది. లఖ్‌నవూతో ఉప్పల్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

Published : 08 May 2024 14:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఓడిపోతుందని భావించిన మ్యాచ్‌ను గెలుస్తుంది. సులువుగా విజయం సాధిస్తుందిలే అనుకున్న మ్యాచ్‌ను పోగొట్టుకొంటోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు మరోసారి ఉప్పల్‌ వేదికగా లఖ్‌నవూతో తలపడేందుకు సిద్ధమైంది. ఇందులో ఎవరు ఓడినా.. వారి ‘నాకౌట్‌’ దశకు చేరుకోవాలనే ఆశలకు గండి పడినట్లే. 

  • అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఈ ఎడిషన్‌లో హైదరాబాద్‌ తన తొలి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. సెకండ్ హాఫ్‌లో.. ఆ జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.
  • తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు దూకుడుగా ఆడి భారీ స్కోర్లను ప్రత్యర్థి ఎదుట లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. దానిని కాపాడుకోలేకపోయింది. 
  •  ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు తలపడ్డాయి. అన్నింట్లోనూ లఖ్‌నవూనే గెలిచింది. గతేడాది చివరిసారిగా ఇరు జట్లూ తలపడిన మ్యాచ్‌లో 183 పరుగుల టార్గెట్‌ను లఖ్‌నవూ ఛేదించి విజయం సాధించింది. 
  • ప్రస్తుత ఎడిషన్‌లో గత మూడు మ్యాచుల్లో ముంబయిని ఓడించిన ఆ జట్టు కోల్‌కతా, రాజస్థాన్‌ చేతుల్లో ఓడి ‘ప్లేఆఫ్స్‌’ను లఖ్‌నవూ సంక్లిష్టం చేసుకుంది. 
  • ట్రావిస్‌ హెడ్‌ అదరగొట్టేస్తుండగా.. అభిషేక్ శర్మ ఇప్పుడు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తోంది. క్లాసెన్‌ నుంచి పెద్దగా మెరుపులు రావడం లేదు. నితీశ్‌రెడ్డి నిలకడైన ఆటను కొనసాగిస్తున్నాడు. 
  • లఖ్‌నవూ బ్యాటర్లలో కేఎల్ రాహుల్, స్టాయినిస్‌, పూరన్‌ డేంజరస్‌. వీరికి తోడుగా డికాక్‌, ఆయుష్, దీపక్ హుడా బ్యాట్‌ను ఝళిపిస్తే ఆ జట్టును ఆపడం ఎవరితరమూ కాదు. లఖ్‌నవూ బౌలర్లు మోసిన్ ఖాన్, నవీనుల్‌ హక్, యశ్ ఠాకూర్‌ గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించారు. రవి బిష్ణోయ్, కృనాల్‌ పాండ్యతో కూడిన స్పిన్‌ విభాగం బలంగానే ఉంది. 
  • హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం ఎక్కువగా భువనేశ్వర్, కమిన్స్‌, నటరాజన్‌పైనే ఆధారపడుతోంది. జయంత్‌ ఉనద్కత్ సీనియారిటీ పెద్దగా అక్కరకు రావడం లేదు. స్పిన్‌ విభాగంలో షహబాజ్‌ నుంచి మెరుగైన ప్రదర్శన రావడం లేదు. 
  • ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, మంగళవారం రాత్రి భారీగా వర్షం పడటంతో పిచ్‌ బౌలర్లకు సహకారం లభించే అవకాశం లేకపోలేదు. ఇవాళ మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
  • హైదరాబాద్‌ (తుది జట్టు అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, అబ్దుల్ సమద్, షహబాజ్‌ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్. ఇంపాక్ట్: నటరాజన్‌
  • లఖ్‌నవూ (అంచనా): క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుశ్‌ బదోని, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, నవీన్‌ ఉల్ హక్, యశ్‌ ఠాకూర్. ఇంపాక్ట్‌: అర్షిన్ కులకర్ణి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు