Harish Rao: అబద్ధాలతో ప్రభుత్వాలను నడిపించడం సరికాదు: హరీశ్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Updated : 05 Feb 2024 15:55 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. భారాస అధినేత కేసీఆర్‌పై సీఎం వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, మళ్లీ అప్పగించేది లేదని చెబుతోంది. ప్రాజెక్టుల అప్పగింతపై జనవరిలో సమావేశం జరిగింది. నెల రోజుల్లోగా 15 అవుట్‌లెట్స్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని మినిట్స్‌లో చెప్పారు. ప్రాజెక్టులను అప్పగించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు తప్పయితే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదు? నేను మీడియా సమావేశం పెట్టాక ప్రభుత్వం దిల్లీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 1న కేఆర్‌ఎంబీ రెండో మీటింగ్‌ జరిగింది. ప్రాజెక్టులు, ఉద్యోగులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదు. 2 నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డి వాటిని దిల్లీ చేతిలో పెట్టారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారు. అబద్ధాలతో ప్రభుత్వాలను నడిపించడం సరికాదు’’ అని హరీశ్‌ రావు హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని