icon icon icon
icon icon icon

తొలుత రైతు రుణమాఫీ

రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పేదప్రజలు, దేశం ఆత్మపై దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

Updated : 10 May 2024 04:21 IST

కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు
ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ
బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం
నర్సాపూర్‌, సరూర్‌నగర్‌ జనజాతర సభల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పేదప్రజలు, దేశం ఆత్మపై దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. గత పదేళ్లలో 22-25 మంది బిలియనీర్లకు మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, పేదలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు మాత్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. జూన్‌ 4న కేంద్రంలో ఇండియా కూటమి సర్కారు ఏర్పాటైన వెంటనే తొలుత రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బిలియనీర్లకు మోదీ సర్కారు మాఫీ చేసిన డబ్బును పేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగస్టు 15 నుంచి చేపడతామని తెలిపారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన జనజాతర సభల్లో రాహుల్‌ మాట్లాడారు. రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగాన్ని అందరూ కలిసి పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతు భరోసా అందించిందని, పోడుభూముల సమస్యను పరిష్కరించిందని వివరించారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం దిల్లీలో సైనికుడిలా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. రాష్ట్రం తరహాలోనే దేశంలో కాంగ్రెస్‌ పరిపాలన అందిస్తుందని చెప్పారు.

రాజ్యాంగంతోనే బలహీనులకు రక్షణ..

‘‘దేశంలోని పేదలు, బలహీనులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, రైతులు, కార్మికుల అధికారాలను రాజ్యాంగం రక్షిస్తోంది. అది పేదల గొంతుక. కాంగ్రెస్‌ పార్టీ, దేశంలోని కోట్ల మంది రక్తాన్ని చిందించి పోరాటం చేసి రాజ్యాంగాన్ని తయారు చేశారు. గాంధీ, అంబేడ్కర్‌, నెహ్రూ ఏళ్ల తరబడి స్వాతంత్య్ర పోరాటం చేసి, జైలుకెళ్లి, చెమటోడ్చి అందుబాటులోకి తీసుకువచ్చారు. లోక్‌సభ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని రక్షించి, దేశాన్ని కాపాడాలని రాహుల్‌, రేవంత్‌రెడ్డి, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి అంటోంది. రాజ్యాంగాన్ని మార్చాలని, పక్కన పెట్టాలని మోదీ, అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ప్రపంచంలోని ఏశక్తీ రాజ్యాంగాన్ని రద్దు చేయలేదు.

దేశాన్ని 2-3 శాతం మందే నడిపిస్తున్నారు..

దేశంలో 50 శాతం మంది బీసీలు, 15 శాతం ఎస్సీలు, 8 శాతం ఆదివాసీలు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం మంది జనరల్‌ వర్గాల్లోని పేదలు ఉన్నారు. వీరందర్నీ కలిపితే 90 శాతానికి పైగా అవుతారు. కానీ, వారికి దేశ పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించడం లేదు. తెలంగాణలో ఎలా కులగణన చేస్తున్నామో.. అలాగే దేశవ్యాప్తంగా చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదల రాజకీయ చైతన్యం కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. దేశాన్ని కేవలం 2-3 శాతం మంది నడిపిస్తున్నారు. ప్రభుత్వం, సంస్థలు.. అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. కులగణన తర్వాత ఈ దేశానికి ఎవరి బలం ఎంతో తెలియడంతో పాటు బడుగు, బలహీనవర్గాల వాటా ఎంత ఉండాలో వెల్లడవుతుంది.

ప్రజలను లక్షాధికారుల్ని చేస్తాం..

భాజపా 22 మంది బిలియనీర్లను తయారు చేస్తే.. ఇండియా కూటమి కోట్ల మందిని లక్షాధికారుల్ని చేసేలా చారిత్రక, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలైన తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశమూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. మోదీ బిలియనీర్లకు డబ్బు ఇస్తే.. మేం పేదలు, రైతులు, నిరుద్యోగులకు ఇవ్వనున్నాం. తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా దేశంలోని అన్ని గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరించి, పేదల పేర్లు జాబితాలో చేర్చుతాం. రైతులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అత్యంత పేదరికంలో ఉన్నవారి వివరాలు తీసుకుంటాం. అత్యంత పేదకుటుంబాల్లో ఒక్కో మహిళ పేరు ఎంపిక చేసి.. ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి సర్కారు ఏడాదికి రూ.లక్ష చొప్పున జమ చేస్తుంది. కోట్ల కుటుంబాలకు ప్రతినెలా రూ.8,500 చొప్పున ఒకటో తేదీన బ్యాంకు ఖాతాలో జమవుతాయి. ఈ డబ్బును చదువు, ఆరోగ్యం, భోజనం కోసం ఖర్చు చేసుకోవచ్చు. దేశంలో, తెలంగాణలో ఒక్క దెబ్బతో పేదరికం దూరమవుతుంది.

ఏడాది శిక్షణతో కూడిన కొలువులు..

మహిళలు తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్ముతో దుస్తులు, మందులు కొంటారు. ఈ దేశంలోని చిన్న, పెద్ద కంపెనీలు వాటిని తయారు చేస్తాయి. ఈ పరిశ్రమల పని ప్రారంభమైన వెంటనే.. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మోదీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా మార్చేశారు. అదానీ కోసం నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ తీసుకొచ్చారు. మేం ‘మొదటి ఉద్యోగం పక్కా’ పేరిట కొత్త పథకం తీసుకొస్తున్నాం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, ఆసుపత్రులు, కార్యాలయాల్లో నిరుద్యోగులకు ఏడాదిపాటు శిక్షణతో కూడిన కొలువులు కల్పిస్తాం. దేశంలోని ప్రతి పట్టభద్రుడు, డిప్లొమా హోల్డర్‌కు అప్రెంటిస్‌షిప్‌ కల్పిస్తాం. అప్రెంటిస్‌ కాలంలో ఏడాదికి రూ.లక్ష అందిస్తాం. వరి, గోధుమలు, ఇతర ఆహార పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తాం. ఉపాధి హామీ కార్మికులకు ప్రస్తుతం రోజుకు రూ.250 లభిస్తోంది. కూటమి సర్కారు వచ్చిన వెంటనే రూ.400 చేస్తాం. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాల్ని రెట్టింపు చేస్తాం’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.


మోదీ కేవలం 22-25 మంది బిలియనీర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారు. గత పదేళ్లుగా అదానీ, అంబానీ కోసమే పనిచేశారు. పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు వారికే ఇచ్చారు. ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేశారు. వారి దగ్గర ఉన్న సంపద.. దేశంలో 75 కోట్ల మంది సంపదతో సమానం. ఆ ధనవంతుల కోసమే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు తొలగించేందుకు ఇలా చేస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా అంటోంది. 50 శాతం కన్నా ఎక్కువగా ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

రాహుల్‌గాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img