మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది.

Updated : 10 May 2024 07:41 IST

అక్కడ ఓ డ్యాం నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ టెండర్‌ దాఖలు నేపథ్యంలో లేఖ..

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్‌అండ్‌టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. తాము పని చేసిన ప్రాజెక్టులలో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్‌అండ్‌టీ.. ఉత్తరాఖండ్‌లో దాఖలు చేసిన ఓ టెండర్‌లో  ధ్రువీకరణ (అండర్‌ టేకింగ్‌) ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ స్ట్రక్చర్‌ దెబ్బతిందని, ఈ పని ఎల్‌అండ్‌టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌కు ఉత్తరాఖండ్‌ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. పనికి సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది.

ఉత్తరాఖండ్‌లో గౌలా నదిపై జమ్రాని డ్యాం నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26న టెండర్‌ పిలిచింది. ఇందులో 150.6 మీటర్ల ఎత్తుతో కాంక్రీటు గ్రావిటీ డ్యాం నిర్మాణం, అనుబంధ పనులకు ఎల్‌అండ్‌టీ టెండరు దాఖలు చేసింది. దీంతోపాటు తాము చేపట్టిన ప్రాజెక్టులలో వైఫల్యాలు చెందిన చరిత్ర లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన వివరాలను సమర్పించింది.

అయితే ఈ బ్యారేజీ నిర్మాణంలో స్ట్రక్చరల్‌ వైఫల్యం ఉందని పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు నివేదించాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ను ఉత్తరాఖండ్‌ కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టు సంస్థ ఎవరు? సంయుక్త భాగస్వామ్యం అయితే ఎవరి వాటా ఎంత? బ్యారేజీ ప్రధాన స్ట్రక్చర్‌లో వైఫల్యం జరిగిందా? ఈ ఘటన నిర్మాణం సమయంలోనా లేక డిఫెక్ట్‌ లయబులిటీ పిరియడ్‌లోనా లేక ఆ తర్వాత జరిగిందా అనేది తెలపాలని కోరింది. ఈ వైఫల్యం విపత్తు వల్ల జరిగిందా? లేదా? అనేది కూడా నిర్ధారించాలని కోరింది. ఈ నెల 8న నీటిపారుదల శాఖకు ఈ లేఖ వచ్చినట్లు తెలిసింది.

ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభుత్వానికి రాసిన లేఖలో.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు పొరపాటున పేర్కొన్నానని, ఈ తప్పును క్షమించాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కోరారు’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు దెబ్బతిన్న బ్యారేజీని సొంత ఖర్చుతో బాగు చేయాల్సిన బాధ్యత ఏజెన్సీదేనని, లేకుంటే చర్యలు తీసుకోవడంతోపాటు జరిగిన నష్టాన్ని ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో రాశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఏం సమాధానం ఇస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారుల సమావేశం కూడా జరిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని