icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కు ఏటీఎంలా రాష్ట్రం

ప్రస్తుత ఎన్నికలు ఓట్‌ ఫర్‌ జిహాద్‌, ఓట్‌ ఫర్‌ వికాస్‌లకు మధ్య.. కాంగ్రెస్‌ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్‌ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Published : 10 May 2024 06:53 IST

భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం
‘భువనగిరి సభ’లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, భువనగిరి: ప్రస్తుత ఎన్నికలు ఓట్‌ ఫర్‌ జిహాద్‌, ఓట్‌ ఫర్‌ వికాస్‌లకు మధ్య.. కాంగ్రెస్‌ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్‌ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా మోదీ నినాదమే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ పార్టీలు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. షరియత్‌, ఖురాన్‌ ఆధారంగానే తెలంగాణలో పాలన సాగుతోందని ఆరోపించారు. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా గురువారం భువనగిరి పురపాలిక పరిధిలోని రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు.  ఇప్పటికే దేశంలో మూడు దశల ఎన్నికలు పూర్తి కాగా.. వాటిలో 200 స్థానాల్లో భాజపా గెలవబోతోందని, మొత్తంగా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకమని అన్నారు. రాష్ట్రంలో పది కంటే ఎక్కువ స్థానాల్లో పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస తొమ్మిదిన్నరేళ్లపాటు అవినీతికి పాల్పడితే.. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు.

రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు

‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందంటే ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. భువనగిరిలో ఆ పార్టీ అభ్యర్థి గతంలో రాహుల్‌ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే.. సస్పెండ్‌ చేశారు. వేరే అభ్యర్థులు దొరకక.. ఆయనకే టికెట్‌ ఇచ్చారు. అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మోదీ మూడోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లను తొలగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తోంది. పదేళ్లుగా పూర్తి మెజార్టీతో మేం అధికారంలో ఉన్నా ఎవరి రిజర్వేషన్లనూ తొలగించలేదు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కోటాలో నుంచి ముస్లింలకు 4 శాతం ఇచ్చారు. ఇక్కడ పది కంటే ఎక్కువ స్థానాల్లో భాజపాను గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి.. తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తాం.

హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌..

తాను ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్‌ ఎన్నటికీ నెరవేర్చదు. మోదీ అయితే ఏం చెబితే అది తప్పకుండా చేస్తారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు. చేయలేదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ అయోధ్య రామమందిరాన్ని ఓట్ల కోసం వినియోగించుకుంది. మోదీ మాత్రం రామమందిర నిర్మాణం వాగ్దానాన్ని నెరవేర్చారు. తెలంగాణకు, రాజస్థాన్‌కు కశ్మీర్‌తో ఏం సంబంధమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. అక్కడ 370 ఆర్టికల్‌ను తొలగించి.. 24 గంటలూ జాతీయ పతాకం ఎగిరేలా ప్రధాని మోదీ సంకల్పం చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల చర్యల నుంచి దేశాన్ని సురక్షితం చేశారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. దాని కోసం భువనగిరి యువత, ప్రజలు ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్‌టైల్‌ పార్కు

ప్రధాని మోదీ భువనగిరికి చాలా చేశారు. ఇక్కడి జౌళి పరిశ్రమ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్‌టైల్‌ పార్కు, చేనేత పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా రైతు కూలీలకు, రైతులకు లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో తీసుకువచ్చిన జాతీయ టెక్స్‌టైల్‌ విధానం ద్వారా 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు ద్వారా నల్గొండ, భువనగిరి, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. జనగామ, భువనగిరి రైల్వేస్టేషన్‌లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నాం. కొమురవెల్లిలో త్వరలోనే రైల్వేస్టేషన్‌ నిర్మిస్తాం. రాయగిరి నుంచి వరంగల్‌ వరకు ఇప్పటికే నాలుగు లైన్ల రైల్వే ట్రాక్‌ పూర్తయింది. సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం వేగంగా సాగుతోంది’’ అని అమిత్‌షా అన్నారు. బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. హామీల అమలులో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు కావాల్సింది ప్రమాణాలు కాదని.. వాగ్దానాల అమలు అని అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, చాడ సురేశ్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి, పడాల శ్రీనివాస్‌, సంకినేని వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భువనగిరికి వచ్చిన అమిత్‌షా.. అక్కడి నుంచి రహదారి మార్గంలో సభాస్థలికి చేరుకున్నారు.


ఆ మూడు పార్టీలూ ఒక్కటే

ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ ఒక్కటే. మైనార్టీల సంతుష్టీకరణలో అవి ఏబీసీల్లా పనిచేస్తున్నాయి. ఏ అంటే అసదుద్దీన్‌, బీ-భారాస, సీ-కాంగ్రెస్‌. మజ్లిస్‌ను నిలువరించడం భారాస, కాంగ్రెస్‌ వల్ల కాదు. అది కేవలం భాజపాతోనే సాధ్యం. హైదరాబాద్‌లో శ్రీరామనవమి ఊరేగింపును అడ్డుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. ఇండి కూటమి నేతలు సీఏఏని వ్యతిరేకిస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రామమందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని సైతం తిరస్కరించారు. వీరికి ఎందుకు ఓటేయాలి?

 అమిత్‌ షా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img