icon icon icon
icon icon icon

కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం

అసెంబ్లీ ఎన్నికలలో భారాసపై  వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. ఇష్టం లేకపోయినా అప్పుడు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

Published : 10 May 2024 06:53 IST

రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే
సీఎం రేవంత్‌ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
హామీలు అమలు చేయనందుకా.. ఆయన అంటున్న రెఫరండం?
విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు
‘మరోసారి మోదీ’ అనేది జన నినాదం
అభివృద్ధి, సుస్థిర పాలనకు భాజపాను ఆశీర్వదించాలి
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలలో భారాసపై  వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. ఇష్టం లేకపోయినా అప్పుడు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌, భారాసలను చూడటం లేదు. నరేంద్ర మోదీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. భాజపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

కిషన్‌రెడ్డి


ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము రెండంకెల స్థానాలు సాధించడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ పార్టీకి ఇంత సానుకూలమైన ఎన్నికలను గతంలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వాటిపై కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదని అన్నారు. ఎన్నికల్లో భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, నిందలు వేయడం భారాస, కాంగ్రెస్‌లకు సాధారణమైపోయిందని విమర్శించారు. కేంద్రంలో సుస్థిర పాలన, స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతో దేశం, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రజలు కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపాను ఆశీర్వదించాలని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.  ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.....

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని సీఎం ఆరోపిస్తున్నారు?

సీఎం రేవంత్‌రెడ్డి అసలు విషయాలను పక్కన పెట్టేస్తారు. లేని సమస్యలు సృష్టిస్తారు. ప్రజలను గందరగోళపరిచి ఆందోళనకు గురి చేయాలని చూస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం గురించి ఇన్ని రోజులూ ఆయన మాట్లాడలేదు. ఎన్నికలు వచ్చేసరికి మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లకు పైగా ఇస్తే ఆయన ఇలా మాట్లాడతారా? సీఎం స్థాయిలో వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదు. మరి రేవôత్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మేం ఏమనాలి? కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వలేదు. ఇంకా అమలు కానివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏమనాలి? ప్రజలకు అది గాడిదగుడ్డు ఇచ్చిందా అని అనాలి. అసెంబ్లీ ఎన్నికలప్పుడే తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చిందో స్పష్టంగా వివరించా. ఎంత ఇచ్చింది...ఎంత ఖర్చయింది అనేది అంతా బహిరంగమే. కేంద్రం ఏమి ఇచ్చిందో సీఎం తెలుసుకోవాలి కదా.. ఇప్పుడు ఇలా మాట్లాడి రేపు కేంద్రం వద్దకు ఎలా వస్తారు? ఏం అడుగుతారు? కేంద్రంతో సరైన సంబంధాలు లేకపోవడంతో రాష్ట్రం నష్టపోయిందని సీఎం సహా మంత్రులు అంతా మాట్లాడారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటా అని అన్న సీఎం ఇప్పుడు ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ పోరును, ఈ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే మీ పార్టీ పరంగా  గమనించిన అంశాలు ఏమిటి?

అసెంబ్లీ ఎన్నికల్లో మేం బలంగా ముందుకు వెళ్లాలని అనుకున్నప్పటికీ అనేక కారణాలతో వెళ్లలేకపోయాం. ఓట్లు 6.4 శాతం నుంచి 15 శాతానికి పెరిగినా.. ఒక సీటు నుంచి ఎనిమిది స్థానాలకు చేరుకున్నా.. అనుకున్న లక్ష్యాన్ని మేం చేరుకోలేకపోయాం. అప్పట్లో భారాసపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్‌ పార్టీ లబ్ధి పొందగా మేం అనుకున్న మేర స్థానాలు పొందలేకపోయాం. లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి వేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచింది. తర్వాత మూడు నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సాధించింది. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నవి దేశానికి సంబంధించినవి. దశాబ్ద కాలంలో భారతదేశ సమగ్రత, అభివృద్ధి, భవిష్యత్తు కోసం మోదీ నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల ప్రాతిపదికగా జరుగుతున్నవి. ఆయన సాధించిన విజయాలపై ప్రజా తీర్పు రాబోతోంది. కచ్చితంగా ఇవి భాజపాకు ప్రత్యేకమైనవి... అనుకూలమైనవి.

పార్టీ గెలుపుపై మీ ధీమాకు కారణాలు ఎలా ఉన్నాయి?

మా పార్టీ ఎక్కువ సీట్లలో గెలుస్తుందని తెలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డి భాజపాపై అన్యాయపు దాడులు, బట్ట కాల్చి మీదవేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గత డిసెంబరు 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ సంతకంతో అప్పట్లో పత్రాలు ఇచ్చారు. ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్‌రెడ్డి వాటిని మరచిపోయారు. ఆ అంశాలు కాకుండా వేరే అన్నింటి గురించి మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు తాను ఏం చెబితే అది వింటారని అనుకునేవారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు.

విభజన హామీలు అమలు చేయలేదని కేసీఆర్‌ అంటున్నారు?

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ విభజన హామీలపై దుష్ప్రచారం చేయడం అలవాటైంది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ బదులు కోచ్‌లు, వ్యాగన్‌లు, ఇంజిన్‌లు తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే నాడు కేసీఆర్‌ ప్రారంభోత్సవానికి రాలేదు. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభోత్సవానికి వచ్చి కోచ్‌ ఫ్యాక్టరీ అన్నారు. అదనంగా వ్యాగన్లు, ఇంజిన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఎందుకు పెడుతున్నారని అడగవచ్చు కదా? విభజన హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆచరణ సాధ్యం కాదని 50 సార్లు చెప్పాం. 2018 ఎన్నికల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి, గెలిచిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదో ప్రజలకు చెప్పాలి.

ఎక్కువ మంది భాజపా ఎంపీలు గెలిస్తే రాష్ట్రంపై మీ దృక్కోణం ఏమిటి?

పదేళ్లలో కేంద్రం రాష్ట్రంలో రూ.9 లక్షల కోట్లకు పైగా వ్యయం చేసింది. రామగుండం యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటైంది. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రారంభమైంది. సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ వచ్చింది. రక్షణ రంగంలో అనేక కొత్త యూనిట్‌లు వచ్చాయి. రూ.26 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ వచ్చింది. 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ వచ్చింది. రానున్న రోజుల్లో తెలంగాణకు ఏవి హక్కుగా రావాలో అవి తీసుకువస్తాం. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతాం. మరోసారి మోదీ అనేది భాజపా నినాదం కాదు.. అది ప్రజల నినాదంగా మారింది. ఫిర్‌ ఏక్‌ బార్‌ అంటే.. ప్రజలే మోదీ సర్కార్‌ అని స్పందిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనను మీరు ఎలా చూస్తున్నారు?

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఏమైనా చేస్తే కదా ఆ ప్రభుత్వం గురించి ఏమన్నా చెప్పటానికి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ ప్రయాణాల సందర్భంలో కేవలం దీంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2,500 ఇచ్చిందని, రుణమాఫీ చేసిందని, రైతు బంధు ఇచ్చిందని.. ఇలా ప్రజలు భ్రమపడతారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారేమో!

రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది?

ప్రతి సీట్లో కూడా భాజపా గ్రాఫ్‌ రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేని సానుకూల వాతావరణం ఉంది. ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోంది. మహిళలు ప్రధానంగా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. మోదీ ప్రభుత్వ పాలన, సాహసోపేత నిర్ణయాలు ఎంతో ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణ ప్రజలకు జాతీయ భావజాలం ఎక్కువ. రెండంకెల స్థానాలు గెలుస్తాం.

రిజర్వేషన్ల అంశం భాజపాను ఆందోళనకు గురి చేస్తోందా?

రిజర్వేషన్ల అంశంపై సీఎం మాట్లాడుతున్న అంశాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజకీయాలు చేయాలి కానీ లేనిది అంటగట్టి మాట్లాడటం సరికాదు. అసలు రిజర్వేషన్లు ఎలా రద్దవుతాయి? దానికి అవకాశం ఉందా? ఈ ప్రచారం తర్వాత ఒక్క నిరసన కార్యక్రమమైనా జరిగిందా? సీఎం మాటలు ప్రజలు నమ్మితే ఒక్కటే నిమిషంలో తెలంగాణలో పెద్ద ఉద్యమం వస్తుంది. ప్రజలు అంతా రోడ్లపైకి వస్తారు. భాజపాపై రాజకీయంగా బురదచల్లే ప్రయత్నం ఇది. మా పార్టీని దెబ్బతీయాలనే ఆయన ఇదంతా చేస్తున్నారు. ఆయన వద్ద మాట్లాడేందుకు వేరే అంశాలు లేవు. ప్రధాని స్వయంగా తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లు రద్దు కావు అని చెప్పారు. ఇంతకంటే సూటిగా, స్పష్టంగా ఎవరు చెప్పాలి?
ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, హిందువులు సహా రిజర్వేషన్‌ పరిధిలో లేని పేదలకు పదిశాతం రిజర్వేషన్లు ఇచ్చాం. భాజపా రిజర్వేషన్లు ఇచ్చే పార్టీనే తప్ప తీసుకునే పార్టీ కాదని గుర్తించాలి.


రిజర్వేషన్ల రద్దు అనేది చిన్న అంశం కాదు. రద్దు చేస్తే ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టదు. మాకు కూడా సామాజిక స్పృహ ఉంది. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానిస్తే భాజపా గౌరవించింది. రాజ్యాంగాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలనేది మా పార్టీ సంకల్పం.


లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌ పాలనకు రెఫరండం అని సీఎం అంటున్నారు?

ఏం చేశారని ఈ ఎన్నికలను ఆయన రెఫరండం అని అంటున్నారు? హామీలు అమలు చేయనందుకా? దిల్లీకి సూట్కేసులు మోసినందుకా? ఫింఛను పెంచలేదు.. రైతుబంధు ఇవ్వలేదు.. వ్యవసాయదారులకు రుణమాఫీ జరగలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వలేదు.. తులం బంగారం పత్తాలేదు.. 420 హామీల్లో ఎన్ని అమలు చేశారు? దేనికి రెఫరండం?

సికింద్రాబాద్‌ ఓటర్లకు ఏం చెబుతారు?

ఏ రోజూ కూడా నేను అది చేస్తా... ఇది చేస్తా అని హామీ ఇవ్వను. ప్రజలకు అవసరమైన అన్నీ చేసిపెడతా. సికింద్రాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా ఐదేళ్లు పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని దేశం, రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధికి ఉపయోగించుకున్నా. ప్రజాప్రతినిధిగా ఓటర్లు తలదించుకునేలా ఏనాడూ పనిచేయలేదు. నీతి నిజాయతీతో పనిచేశా. ప్రజల గౌరవం పెంచేలా పనిచేస్తా అని మాట ఇసున్నా. మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నా. తెలంగాణలో ప్రజలు మోదీని ఆశీర్వదించడండి. ఆయన నాయకత్వంలో దేశానికి, తెలంగాణకు మేలు జరుగుతుంది.


కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లకు పైగా ఇచ్చి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఆయన ఇలా మాట్లాడతారా? గాడిదలు గుడ్లు పెడతాయో లేదో సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదు కానీ, గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. దాన్ని చూసి చాలామంది కాంగ్రెస్‌.. గుర్తు మార్చుకుందని అనుకుంటున్నారు.

కిషన్‌రెడ్డి


ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించేలా, సామాజికంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదు. ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నందుకు ఆయనపై కేసులు పెట్టాలి. సీఎం రెండే అంశాలు మాట్లాడుతున్నారు. అవి.. రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు. అవి రెండూ పూర్తిగా నిరాధారమైనవి.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img