icon icon icon
icon icon icon

వికసిత్‌ కాదు.. విఫల భారత్‌!

‘‘మోదీ పదేపదే చెప్పే వికసిత భారత్‌.. విఫల భారత్‌ అయింది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ కూడా సత్యనాశ్‌ అయింది’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 10 May 2024 06:53 IST

భావోద్వేగాలతో భాజపా ఆటలు
హామీలతో కాంగ్రెస్‌ మోసం చేసింది
కరీంనగర్‌ రోడ్‌షోలో కేసీఆర్‌

కరీంనగర్‌, ఈనాడు- రాంపూర్‌, న్యూస్‌టుడే: ‘‘మోదీ పదేపదే చెప్పే వికసిత భారత్‌.. విఫల భారత్‌ అయింది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ కూడా సత్యనాశ్‌ అయింది’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. గురువారం రాత్రి కరీంనగర్‌లో కరీంనగర్‌ భారాస లోక్‌సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ పదేళ్ల మోదీ పాలనతో పాటు, నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనపై మండిపడ్డారు. ‘‘ఇప్పటికే మోదీ పాలనలో దేశం నాశనమైంది.. ఇంకా ఇలాగే కొనసాగితే సర్వనాశనమవుతుంది.మాట్లాడితే పాకిస్థాన్‌, పుల్వామా అంటారు. భాజపా భావోద్వేగంతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మనతో ఆటలాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఆగమవుతుంది. పదేళ్ల కిందట మోదీ ప్రధాని అయ్యారు. 150 హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 14 మంది పీఎంలు కలిసి రూ.51 లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే... ఒక్క మోదీయే రూ.105 లక్షల కోట్ల అప్పు చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు రుణాలు మాఫీ చేశారు. రైతులను మాత్రం రాచి రంపాన పెట్టారు. విద్యాచట్టం ప్రకారం ప్రతి జిల్లాకు నవోదయ ఇవ్వాలి. కానీ తెలంగాణకు ఇవ్వలేదు. దీనికోసం 150 ఉత్తరాలు రాశాను. 157 వైద్యకళాశాలలు అంతటా ఇచ్చి రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా రాలేదు. పైగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మెడపై మోదీ కత్తి పెట్టారు. నన్ను చంపినా.. నా తల తెగినా మీటర్లు పెట్టనని చెప్పాను. రూ.5 వేల కోట్ల భారం పడినా భరించాం. గత లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు భాజపా ఎంపీలు గెలిచి నాలుగు రూపాయల పని చేయలేదు. కరీంనగర్‌కు సంజయ్‌తో ఏమైనా లాభం జరిగిందా..? ఆయన మాట్లాడితే అది ఏ భాషనో అర్థం కాదు.

రాష్ట్ర భవిష్యత్తు మనది

ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్నాం. ఇకముందు అలా జరగొద్దు! రాష్ట్ర భవిష్యత్తు మనది. కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠాన్ని చూపించింది. ఆరు గ్యారంటీలు 13 అంశాలు, 420 హామీలతో మోసం చేసింది. రాహుల్‌గాంధీ, మహిళా నాయకురాలు అల్కాలాంబా మహిళలకు రూ.2500 ఇస్తున్నామన్నారు. కానీ ఇస్తున్నారా..?కరోనా కష్టమొచ్చినా.. నోట్ల రద్దుతో ఇబ్బందులున్నా, రూ.30 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 12 రోజులుగా బస్సు యాత్ర చేస్తున్నాను. ఎక్కడ అడిగినా కాంగ్రెస్‌ చేసిందేమీ లేదంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగిందని ఆగం చేశారు. నాడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జలదృశ్యంగా కనిపించేది. 200 కి.మీ.ల మేర గోదావరి అమృతధారలా ప్రవహించేది. నేను ముఖ్యమంత్రి అయిన ఏడాదిన్నరలో కరెంట్‌ లోటులేకుండా ఇచ్చాం. ఇవన్నీ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. బాధ కలుగుతోంది. నాలుగైదు నెలల్లోనే ఇంత ఆగమెందుకైంది. రేవంత్‌రెడ్డి 5 ఎకరాలు పైబడిన వారికి రైతుబంధు ఇవ్వరట. దున్నినవారికి ఇస్తారట. వాళ్లనెలా గుర్తిస్తారు. రేషన్‌పై సన్నబియ్యం రావట్లేదు. బెల్ట్‌ దుకాణాలు రద్దు చేస్తామని చెప్పి చేయలేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో.. తెలియదు.! దళితబంధు హుజూరాబాద్‌లో 20 వేల మందికిచ్చాం. రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్‌ ఎందుకివ్వడం లేదు. కరీంనగర్‌, నిజామాబాద్‌లలో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది. అందుకనే ముస్లిం మైనారిటీలు భారాసకు ఓటెయ్యాలి. మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే భాజపా గెలిచే ప్రమాదముంది’’ అని కేసీఆర్‌ అన్నారు. రోడ్‌షోలో కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌తో పాటు కరీంనగర్‌కు ఆయన మనుమడు హిమాన్షు వచ్చారు. బస్సులోనే ఉన్నారు. రోడ్‌షో తరువాత తాత కేసీఆర్‌తో కలిసి తీగలగుట్టపల్లిలోని స్వగృహానికి వెళ్లారు. అక్కడ స్థానిక భారాస నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా భారాసకు వచ్చే సీట్ల విషయమై చర్చించారు. కరీంనగర్‌లో సర్వే ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని  ఆయన నాయకులకు తెలిపినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img