CWC: శశి థరూర్‌, సచిన్‌ పైలట్‌లకు వర్కింగ్‌ కమిటీలో చోటు.. సీడబ్ల్యూసీ హైలైట్స్‌ ఇవే!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునర్‌వ్యవస్థీకరించింది. గతంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గళం వినిపించిన వారికి సైతం ఇందులో చోటు కల్పించింది.

Updated : 20 Aug 2023 17:21 IST

దిల్లీ: పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్‌ (Congress) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC)ని పునర్‌వ్యవస్థీకరించింది. 39 మందిని వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా, 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఎంపిక చేసింది. గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కూడా ఇందులో స్థానం కల్పించడం గమనార్హం.

  • రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను (Sachin Pilot) అధిష్ఠానం వర్కింగ్‌ కమిటీలో చేర్చింది. ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలక్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకానొక దశలో సొంత పార్టీపైనే సచిన్‌ తిరుగుబావుటా ఎగురవేశారు. అయితే, అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ఈ వివాదాలకు బ్రేక్‌ పడింది. తాజా నిర్ణయంతో సచిన్‌పైలట్‌కు ఉన్నత గుర్తింపు లభించినట్లయింది.
  • ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌లకు కూడా ఈసారి సీడబ్ల్యూసీలో స్థానం దక్కింది. పార్టీలో సంస్థాగత మార్పులు అనివార్యమంటూ గతంలో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసిన 23 మంది సీనియర్‌ నేతల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. పార్టీ విధానాలతో విభేదించిన శశి థరూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
  • పశ్చిమబెంగాల్‌ మాజీ ఎంపీ దీపా దాస్‌ మున్షీకి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. ఈమె కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి దివంగత ప్రియ రంజన్‌ దాస్‌ మున్షీ సతీమణి. ఈమెతోపాటు కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌కు డబ్ల్యూసీలో సభ్యుడిగా ఎంపిక చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్‌ జాతీయ మీడియా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
  • యువనాయకులను ప్రోత్సహిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ కొత్త ప్యానెల్‌ కూర్పులో ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ ఇటీవల మాట్లాడుతూ.. పార్టీ పదవుల్లో  కనీసం సగం మందిని 50 ఏళ్లలోపు వారినే నియమించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కానీ, తాజా సీడబ్ల్యూసీలో సచిన్‌ పైలట్‌, గౌరవ్‌ గొగొయ్‌, కె. పాటిల్‌ మినహా మిగతా వారంతా 50 ఏళ్లకు పైబడిన వాళ్లే.
  • పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కూడా సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను వెనక్కి రప్పించి.. ఆ స్థానంలో వేరొకరిని నియమించే అవకాశం ఉంది.
  • పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌లను కూడా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు. 
  • దాదాపు అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండేలా వర్కింగ్‌ కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు.
  • ఏపీ నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డిని సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎంపిక చేయగా.. శాశ్వత ఆహ్వానితులుగా తెలుగు రాష్ట్రాలనుంచి టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహ..తదితరులకు అవకాశం దక్కింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని