JP Nadda: వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: జేపీ నడ్డా

వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన

Updated : 07 Jun 2022 19:31 IST

రాజమహేంద్రవరం: వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌  ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రం దాదాపు రూ.8లక్షల కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉందని, ప్రధాని మోదీ ఇచ్చిన నిధులు రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఖాతాల్లో వేసిన నిధులు కూడా పక్కదారి పట్టించే  పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తిరగకూడదు, మాట్లాడకూడదని అనేక రకాల ఆంక్షలు విధించారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడంలేదు.. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తుంటే... ఈ రాష్ట్రంలో మాత్రం  తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందన్నారు. జగన్‌ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని, ఇసుక, ల్యాండ్‌, మద్యం మాఫియా రెచ్చిపోతున్నాయన్నారు. ఏపీలో వైకాపా పోవాలి... భాజపా ప్రభుత్వం రావాలని జేపీ నడ్డా అన్నారు. 

‘‘2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవి. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవి. మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారు. గతంలో బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేది. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారు. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేశారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు గతంలో పేపర్లకే పరిమితమయ్యేవి. నేడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. భారతదేశం ఉత్పాతక దేశంగా మారింది. భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా 2.5కోట్ల ఇళ్లు నిర్మించారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనేదే మోదీ కల.. ఆ కలను నెరవేరుస్తాం. ఒకే దేశం- ఒకే గ్రిడ్‌, ఒకే దేశం- ఒకే రేషన్‌ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది. రెండో అతి పెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారింది. దేశంలో 79 కోట్ల బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాం’’ అని నడ్డా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని