KCR: గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించింది కాంగ్రెస్ కాదా?: కేసీఆర్‌

గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించిన వారెవరని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 

Updated : 06 Nov 2023 20:10 IST

గద్వాల: గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించిన వారెవరని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని, ఇక్కడ వాల్మీకి, బోయ సోదరులు ఎక్కువగా ఉంటారని చెప్పారు. ఆంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం బీసీలని అన్నారు. మన రాష్ట్రంలోనూ వాల్మీకి, బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు కేసీఆర్‌ గుర్తు చేశారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అయినా ఫలితం లేదని చెప్పారు. గద్వాలలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.

‘‘ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారు.  ఆంధ్రాలో ఎస్టీల్లో పెట్టి.. ఇక్కడ బీసీల్లో చేర్చి అన్యాయం చేశారు. ఆనాడు వాల్మీకి, బోయలను ముంచింది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రే. ఆర్డీఎస్‌ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే’’ అని కేసీఆర్‌ అన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న భారాస అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

నారాయణపేట సభలో..

‘‘ఎప్పటివరకైతే ప్రజలు సొంత విచక్షణతో ఓటు వేయరో.. అప్పటివరకు ఈ దేశం బాగుపడదు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల వద్ద ఉన్న అతి విలువైన వజ్రాయుధం.. ఓటు మాత్రమే. అలాంటి వివలువైన ఓటును ఎవరో చెప్పారని ఆగమాగం అయిపోయి వేయొద్దు. మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ తలరాతను మార్చేస్తుంది. ఏ ప్రభుత్వం గెలిస్తే మంచి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్.. భారాస.  దళితులు కూడా ఎంతో అభ్యున్నతి సాధించాలి. కచ్చితంగా ప్రతి కుటుంబానికి దళితబంధు వచ్చే వరకు భారాస ప్రభుత్వం పని చేస్తూనే ఉంటుంది.

కర్ణాటక నుంచి ఒక పెద్ద మనిషి తెలంగాణకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కర్ణాటలో ఐదు గంటలు కరెంటు ఇస్తున్నాం. కావాలంటే వచ్చి చూడండి. 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు ఇస్తున్నాం అంటే నవ్వొస్తుంది. ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. ఇలాంటి మాటలే చెప్పి కర్ణాటక ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్‌ రాజ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మళ్లీ ఆ తరహా సమస్యలు తీసుకొచ్చుకుందామా?తెలంగాణ బాగుండాలంటే ముందు పల్లెలు బాగుపడాలి అని అనుకున్నాం. అందుకే వ్యవసాయాన్ని స్థిరీకరించాం. ప్రజలకు మంచి చేసే ఎన్నో ఉత్తమ సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నాం. హైదరాబాద్ తర్వాత రెండో మున్సిపాలిటీగా నారాయణపేట ఏర్పడింది. నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌కు నీళ్లు ఇచ్చే కాల్వలను మంజూరు చేశాం. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే అతి త్వరలోనే కాల్వలను పూర్తి చేసుకుంటాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని