Atchannaidu: వైకాపా ఫేక్‌ పోస్టులను వదిలిపెట్టం: అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్‌కు వైకాపా ప్రభుత్వం రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated : 08 Feb 2024 13:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వైకాపా ప్రభుత్వం రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా చేసిన ప్రతి చట్టమూ రాష్ట్ర వినాశనం కోసమేనని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ‘ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు.. రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. ఏపీలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందన్నారు. అనంతరం వారంతా అసెంబ్లీకి కాలినడకన బయలుదేరి వెళ్లారు.

రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయని అచ్చెన్న పేర్కొన్నారు. 27 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ ఇస్తామని యువతను మోసగించారని మండిపడ్డారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామని చెప్పారు. శాసనసభను సైతం 5 ఏళ్లుగా వైకాపా కార్యాలయంలా నడిపారని విమర్శించారు.

తెదేపాకు ఆ అవసరం లేదు.. 

భాజపా కాళ్లపై పడటం, మొక్కడం వైకాపా సంస్కృతే అని.. తెలుగుదేశానికి ఆ అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. అనేక కేసుల్లో ఏ1 ముద్దాయిగా జగనే అలా చేస్తారంటూ దుయ్యబట్టారు. వైకాపా ఫేక్‌ పోస్టులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపు మేరకే తమ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లారని తెలిపారు. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని