Updated : 14 Aug 2022 09:04 IST

Komatireddy venkatreddy: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కాక.. అసలు ఆయన మనసులో ఏముంది?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ, టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంతో ఆ పార్టీలో జరుగుతున్న రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నేపథ్యంలో చండూరులో నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీలో చిచ్చు రేపాయి. సీనియర్‌ నేత, ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పరుష పదజాలంతో చేసిన కామెంట్స్‌ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ అన్న చందంగా ఆ పార్టీలో కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఆ సభకు అధ్యక్షత వహించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ కోమటిరెడ్డి డిమాండ్‌ చేయడం.. రేవంత్‌ కూడా ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా సారీ చెప్తూ వీడియో రిలీజ్‌ చేయడం జరిగిపోయాయి. అయినప్పటికీ ఈ వివాదం అక్కడితో చల్లారలేదు. 

చిచ్చురేపిన పీసీసీ అధ్యక్ష పదవి..

ఎన్నాళ్ల నుంచో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కాంగ్రెస్‌, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. అలాంటిది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు? పార్టీకి రాజీనామా చేయడానికి ముందు నుంచే పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఎందుకున్నారు? అంటే దానికి కారణాలూ లేకపోలేదు. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీసీసీ అధ్యక్షుడి మార్పు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారనే దానిపై చాలా చర్చలు నడిచాయి. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సరైన నాయకుడు ఎవరనేదానిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం పలు దఫాలుగా అభిప్రాయాలనూ సేకరించింది. ఈ క్రమంలో తెరపైకి ఎందరో వచ్చినా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లపైనే చర్చ జరిగింది. ఈ ఇద్దరిలో ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనేదానిపై అభిప్రాయాలు సేకరించిన అధిష్ఠానం..  చివరికి రేవంత్‌ వైపు మొగ్గు చూపి ఆయన పేరును ప్రకటించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా? అంటూ కొంతమంది సీనియర్లు బహిరంగంగానే తమ అసహనాన్ని వెళ్లగక్కారు. అయినా పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవిస్తామంటూ బయటకు చెప్పుకొచ్చారు. కానీ లోలోపల రేవంత్‌కు వ్యతిరేకంగా కొంతమంది అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టారు. జగ్గారెడ్డిలాంటి నేతలు బహిరంగంగానే  విమర్శలు చేశారు. రేవంత్‌కు ప్రాధాన్యమిస్తూ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను ఎలా విస్మరిస్తారంటూ అంతర్గతంగానూ పలువురు నేతలు చర్చించుకున్నారు. అప్పటి నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎప్పుడో ఆయన కాంగ్రెస్‌ను వీడతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు భాజపా ప్రోత్సాహం తోడవడంతో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు. 

ప్రచారంపై ఆసక్తి చూపని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో కొద్ది నెలల్లో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఎలాగైనా తమ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే అక్కడ ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఉప ఎన్నికకు వారిని సమాయత్తం చేస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, ఇతర బాధ్యతల్లో భాగమయ్యేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తి చూపడం లేదు. పార్టీని రాజగోపాల్‌రెడ్డి వీడిన తర్వాత చండూరులో నిర్వహించిన సభకు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం.. అదే సభలో అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలపై వెంకట్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు సమాచారం ఇవ్వకపోతే ఎలా? అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఒకే రోజు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి సోదరులు వేర్వేరుగా కలిశారు. వరద నష్టం నిధులు అందించాలని కోరేందుకే ఆయన్ను కలిసినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ను వీడేది లేదని చెబుతున్నా.. భాజపాలో చేరేందుకు వెంకట్‌రెడ్డి సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

ఉన్న నాలుకకు మందేస్తే.. 

‘ఉన్న నాలుకకు మందేస్తే.. కొండ నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో చండూరులో కాంగ్రెస్‌ సభ ఏర్పాటు చేస్తే.. అక్కడ అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కొత్త వివాదానికి కారణమయ్యాయి.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ‘ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లిపో..’ అనే క్రమంలో ఓ పరుష పదాన్ని అద్దంకి దయాకర్‌ వాడారు. ఆ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పినా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తేనే రేవంత్‌ క్షమాపణపై ఆలోచిస్తానంటూ మీడియాతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొనడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో పట్టు నిలబెట్టుకునేందుకే అలా అన్నారా? కోరుకున్నట్లే అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తే పార్టీలో కొనసాగుతారా? అదే జరిగితే కోమటిరెడ్డి మునుపటిలా పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూ మునుగోడు ఉప ఎన్నికలో అన్నీ తానై కాంగ్రెస్‌ను ముందుండి నడిపిస్తారా?  లేకపోతే సోదరుడి బాటలోనే పార్టీ మారేందుకు జరిపే ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా? అసలు వెంకట్‌రెడ్డి మనసులో ఏముంది? ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి! వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పనుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని