
Stalin: మే 7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మే 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు నేడు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు పంపించారు.
ప్రమాణం నిరాడంబరంగానే..
ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు. డీఎంకే విజయం సాధించిన అనంతరం ఆయన మెరీనా బీచ్‌లోని తన తండ్రి కరుణానిధి స్మారకం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్ది మంది సమక్షంలో సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.
తమిళనాడులో దశాబ్దకాలం వేచి చూసిన ఉదయం డీఎంకే సొంతమైంది. మొత్తం 234 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 152 చోట్ల విజయం సాధించింది. రెండు సార్లు అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావించిన అన్నాడీఎంకే కూటమి కేవలం 82 స్థానాలకు పరిమితమైంది.