Balakrishna: తెదేపా-జనసేన పొత్తు కొత్త శకానికి నాంది: బాలకృష్ణ

 తెదేపా, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు.

Updated : 16 Nov 2023 18:25 IST

హిందూపురం: తెదేపా, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన తెదేపా-జనసేన సమన్వయ సమావేశంలో ఆయన  మాట్లాడుతూ... ‘‘రాష్ట్రం మొత్తం ఇన్ని సీట్లు.. అన్ని సీట్లు కాదు తెదేపా-జనసేన గెలవాలి. నేను, పవన్‌ కల్యాణ్‌ ముక్కుసూటిగా మాట్లాడుతాం. ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యం. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్థులు, హంతకుల చేతుల్లో ఉంది. పరిపాలన ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలి. రాష్ట్రంలో ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం. పరిపాలన చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారు’’ అని బాలకృష్ణ విమర్శించారు.

హిందూపురం ఆసుపత్రిని పరిశీలించిన బాలకృష్ణ..

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. సరైన సౌకర్యాలు లేవని రోగులు ఫిర్యాదు చేశారు. రోగుల ఫిర్యాదుపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బాలకృష్ణ నిలదీశారు. ‘‘ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. వైద్య పరికరాలు లేవు, ఉన్న వాటిని వాడుకోవటం లేదు. గతంలో నేను ఇచ్చిన వెంటిలేటర్లు నిరుపయోగంగా పడేశారు. తెదేపా హయాంలో ఆసుపత్రి శుభ్రంగా ఉండేది.. ఇప్పుడు అపరిశుభ్రంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అంటున్నాయి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ కింద ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు. నిధుల మళ్లింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టింది’’ అని బాలకృష్ణ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని