Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య

మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. మనిషి ఆశాజీవి కదా! మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.

Updated : 24 Sep 2023 22:41 IST

స్టేషన్ ఘన్‌పూర్ (లింగాల ఘన్‌పూర్‌): కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. మనిషి ఆశాజీవి కదా! మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని అన్నారు. భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం ప్రస్తుత ఎమ్మెల్యే కలసిపోయారనుకున్న తరుణంలో రాజయ్య వ్యాఖ్యలు మరోసారి సంచలన మయ్యాయి. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం వడ్డిచర్లలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడారు.

అన్నీ ఊహాగానాలే.. ఏం జరగలేదు

‘‘కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య కలిసిపోయారు, మా పరిస్థితి ఏంటని రెండు మూడు రోజులుగా ప్రజాప్రతినిధులు నాయకులు అయోమయంలో ఉన్నారు. కానీ, అక్కడ ఏమీ జరగలేదు. కేటీఆర్‌కి నాకు మధ్య మాత్రమే సంభాషణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పుడే నివేదికలు, సర్వే రిపోర్టుల ప్రకారం జాబితాలో చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పారు. ఇంకా బీఫాంలు కూడా ఇవ్వలేదు.    కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు స్వయంగా కలిసినప్పుడు గొప్పగా పని చేస్తున్నావు కేసీఆర్ మరో మారు నీకే అవకాశం కల్పిస్తారని చెప్పడంతో ఆగిపోయా. రెండ్రోజుల క్రితం కేటీఆర్‌ను కలిసినప్పుడు ఎమ్మెల్సీగా గానీ, ఎంపీగా గానీ అవకాశం ఉంటుందని, అప్పటివరకు వీలైతే రాష్ట్ర కార్పోరేషన్లలో నామినేటెడ్ పదవులు తీసుకోమని చెప్పారు. కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తీసిన ఫొటోలతో మీడియాలో ఊహగానాలతో వార్తలు రాశారు’’ అని రాజయ్య వివరించారు.

కలిసి పనిచేస్తానని ఎక్కడా చెప్పలేదు...

ఎక్కడా కూడా తాను శ్రీహరితో కలిసి పనిచేస్తానని చెప్పలేదని రాజయ్య అన్నారు.  ఇటీవల మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశంలో దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు కూడా రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు రాశారని,  ఇది కూడా అలాగే జరిగిందని గుర్తు చేశారు. తాను స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడే ఏదైనా నిజమవుతుందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో పార్టీ నిబంధనల ప్రకారం ఇద్దరం కలిసి పని చేశామన్నారు. 2023 ఎన్నికల్లో సైతం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అభద్రతా భావం ఉండదన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని