Akbaruddin owaisi అక్బరుద్దీన్‌ నిర్దోషి.. తేల్చిన నాంపల్లి కోర్టు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా

Updated : 22 Aug 2022 14:58 IST

హైదరాబాద్‌: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని కోర్టు నిర్దోషిగా తేల్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భవిష్యత్తులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని అక్బరుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అక్బరుద్దీన్‌కు సూచించింది.

అసలేం జరిగింది..

2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, అదే నెల 22న నిర్మల్‌లో విద్వేషపూరిత ప్రసంగం చేశారని అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది. దీనిపై 2013, జనవరి 2న నిర్మల్, నిజామాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జనవరి 8న అక్బర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు తరలించారు. జనవరి 9న అక్బర్‌ను నిర్మల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరి 16న అక్బర్ బెయిల్‌పై విడుదలయ్యారు. అక్బరుద్దీన్‌పై నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పీఎస్, దిల్లీ పీఎస్‌లలో నమోదైన కేసులను 2013 జనవరి 1న అప్పటి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. అయితే నిర్మల్ కేసును మాత్రం స్థానిక పోలీసులే దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా నిజామాబాద్ కేసులో 41 మందిని, నిర్మల్ కేసుకు సంబంధించి 33 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 2016లో సీఐడీ, నిర్మల్ పోలీసులు ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో ఏ-1గా అక్బరుద్దీన్, ఏ-2గా యాయా ఖాన్‌ను చేర్చారు. అక్బరుద్దీన్‌ విద్వేషపూరితంగా మాట్లాడినట్లు తెలిపే వీడియో ఫుటేజ్‌ను సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తుది తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని