ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!

అబ్బాయిలు మాత్రమే విద్యావంతులు కావాలి. అమ్మాయిలు అత్తారింటికి పరిమితంకావాలనే సంప్రదాయం ఉన్న గ్రామంలో పుట్టిందామె.

Published : 09 May 2024 03:23 IST

అబ్బాయిలు మాత్రమే విద్యావంతులు కావాలి. అమ్మాయిలు అత్తారింటికి పరిమితంకావాలనే సంప్రదాయం ఉన్న గ్రామంలో పుట్టిందామె. అయితేనేం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే లక్ష్యాన్ని చేరుకుంది సిమ్రన్‌. ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణిగా నిలిచింది.

పుణెకు 150 కిలోమీటర్ల దూరంలోని ఇందాపూర్‌ అనే కుగ్రామంలో సిమ్రన్‌ థోరట్‌ పుట్టింది. ఈమెకు సోదరుడు శుభం థోరట్‌ ఉన్నాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేసేవారు. ఆ గ్రామంలో ప్రజలు ఆడపిల్లలకు చదువు అవసరంలేదు అనుకుంటారు. దాంతో శుభం కోరుకున్నమేరకు నౌకాయానరంగంలో చేరడానికి రెండెకరాల భూమి విక్రయించి చదివించారు. అయితే అన్నయ్యలా తాను కూడా ఆఫీసర్‌ కావాలని సిమ్రన్‌ కలలు కనేది.
మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌ కావాలంటే మూడేళ్ల కోర్సు పుణెలో పూర్తి చేయాలి. అయితే సిమ్రన్‌ తల్లిదండ్రులతో ఊళ్లోవాళ్లు ఆడపిల్లకు అంత చదువు అవసరమా అన్నారు. వృథా ఖర్చు, పెళ్లి చేసి పంపండి అని సలహా ఇచ్చారు. ‘నేను చేరాల్సిన ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల కోర్సుకు మొత్తం రూ.9 లక్షలు చెల్లించాలి. అంత రుసుమును అమ్మావాళ్లు ఇవ్వలేరు. అలాగే ఊరంతా నాకు చదువొద్దని చెప్పారు. ఇక నా కల నెరవేరదని, అనుకున్న కెరియర్‌ను చేరుకోలేననిపించింది. అయితే అమ్మ మాత్రం నా కలను గెలిపించాలనుకుంది. తనకు చదువుకోవాలని ఉన్నా, పేదరికంతో కుదరలేదు. పైగా చిన్నప్పుడే పెళ్లి చేశారు. కనీసం నేనైనా పెద్ద చదువులు చదవాలని, నాలో తనను చూసుకోవాలని అనుకుందట. అప్పటివరకు మా కుటుంబానికి ఆధారంగా ఉన్న మూడెకరాల పొలాన్ని అమ్మి నా ఫీజు కోసం ఇవ్వాలని నాన్నని అడిగింది. ఇద్దరూ చర్చించుకున్నారు.

నాన్న కూడా సరే అనడం నాకు ఆశ్చర్యమేసింది. బంధువులంతా విమర్శించినా కూడా నా చదువు కోసం పొలాన్ని అమ్మేశారు. దానికన్నా నా కెరియర్‌ ముఖ్యమన్నారు. ఆ డబ్బుతో పుణెలో కోర్సులో చేర్చారు. నా ఖర్చులకు, ఇంటిని నడిపించడానికి నాన్న ఎలక్ట్రీషియన్‌గా మారితే, అమ్మ దగ్గర్లోని చాక్లెట్‌ ఫ్యాక్టరీలో పనికి చేరింది. ఇప్పుడు నా చదువు పూర్తయ్యింది. అనుకున్నట్లుగా నౌకాధికారిణిని కాగలిగా. నా లక్ష్యమే కాదు, అమ్మ కల కూడా నెరవేర్చగలిగా’నంటున్న సిమ్రన్‌ ఆ గ్రామంలోనే తొలి మర్చంట్‌ నౌకాధికారిణిగా నిలిచింది. అంతేకాదు, గ్రామంలోని మరికొందరు అమ్మాయిలను ఉన్నతవిద్యాభ్యాసం చేయించే ఆలోచన వచ్చేలా చేసింది. చదువుకోవాలని కలలుకంటున్న తనలాంటి మరెందరో అమ్మాయిలకు సిమ్రన్‌ మార్గదర్శకురాలైతే, తాను చదువుకోకపోయినా తన కూతురిని ఉన్నతస్థానానికి చేర్చిన ఆమె తల్లి మరెందరో తల్లులకు స్ఫూర్తిదాయకమయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్