యువత మెచ్చేలా కొత్త పథకాలు

కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్‌ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది.

Published : 09 May 2024 02:03 IST

సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న సేవలు
వృద్ధి బాటలో కొనసాగుతాం
‘ఈనాడు’తో కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు
ఈనాడు - హైదరాబాద్‌

కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్‌ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. ఖాతాదార్లకు మరింత చేరువయ్యేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 250కి పైగా కొత్త శాఖలు ప్రారంభిస్తామని కెనరా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కె.సత్యనారాయణ రాజు ‘ఈనాడు’కు వెల్లడించారు. మహిళలు, యువతను ఆకర్షించేలా 2 కొత్త పథకాలు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మహిళల కోసం తీసుకొచ్చిన ‘కెనరా ఏంజెల్‌’ అనే సేవింగ్‌ ఖాతా పథకం కింద రూ.10 లక్షల వరకు కేన్సర్‌ చికిత్సకు, ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులకు బీమా సదుపాయం లభిస్తుంది. యువతకు అనువైన సదుపాయాలతో రూపొందించిన ‘కెనరా హీల్‌’ పథకానికీ మంచి స్పందన లభిస్తోందని అన్నారు.

స్వయం సహాయక బృందాల వద్దకే ఉద్యోగి

కృత్రిమ మేధ(ఏఐ)/ మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) సాంకేతిక పరిజ్ఞానంతో, యువతను ఆకర్షించేలా మెరుగైన సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాట్‌ బాట్‌, ఐవీఆర్‌ఎస్‌లలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, మరిన్ని విభాగాలకు ఈ పరిజ్ఞానాన్ని విస్తరించనున్నామని తెలిపారు. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) వారు ఖాతా తెరవడం, రుణం పొందటం, వాయిదాలు తిరిగి చెల్లించడం వరకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. తమ బ్యాంకు ఉద్యోగే ఆయా బృందాల వద్దకు వెళ్లి ఖాతా తెరవడం నుంచి ఇతర సేవలన్నింటినీ అందిస్తారని; దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు శాఖలన్నింటిలోనూ ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బెంగళూరులోని ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌తో కలిసి దీనికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇటువంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి బ్యాంకు తమదేనని తెలిపారు.

స్థిరమైన వృద్ధి

వచ్చే రెండు, మూడేళ్ల పాటు ఏటా స్థిర వృద్ధి సాధించేందుకు బ్యాంకును పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో 12%, డిపాజిట్లలో 9% వృద్ధి లక్ష్యమని తెలిపారు. నికర వడ్డీ మిగులు (ఎన్‌ఐఎం) 3% కంటే తగ్గదని తెలిపారు. 

ఆకర్షణీయ ఫలితాలు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కెనరా బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. దాదాపు 18% వృద్ధితో మార్చి త్రైమాసికానికి రూ.3,757 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వడ్డీ ఆదాయం పెరగడం, పారు బాకీలు తగ్గడం ఇందుకు నేపథ్యం. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి రూ.14,554 కోట్ల నికరలాభం, రూ.80.23 ఈపీఎస్‌ నమోదైంది. 2022-23లో నికరలాభం రూ.10,603 కోట్లు, ఈపీఎస్‌ రూ.58.45 మాత్రమే ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు 4.23 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1.27 శాతానికి తగ్గాయి. కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే సమయంలో, బ్యాంక్‌ వాటా విక్రయించే అవకాశం ఉందని తెలిపారు. 

161% డివిడెండు: రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16.10 (161%) డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ గల 5 షేర్లుగా విభజించేందుకు, ఈ నెల 15వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని