రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత

రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు.

Published : 09 May 2024 06:37 IST

బాచుపల్లిలో అపార్ట్‌మెంట్‌  ప్రహరీ కూలి ఏడుగురి దుర్మరణం
వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు..

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే బృందం: రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో 10 మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులే ఉన్నారు. ఆయా ఘటనలపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇవీ.. బాచుపల్లిలో కౌసల్యకాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దానిని ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడటంతో అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఐదంతస్తుల భవనాన్ని రైజ్‌ డెవలపర్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడ గతంలో 10-15 అడుగుల ఎత్తు వరకు ప్రహరీని నిర్మించారు. తరువాత దానినే 30-40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలిపోయింది. మృతుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు రాముయాదవ్‌(44), గీతాబల్‌(40), వీరి కుమారుడు హిమాన్షు(4), ఒడిశాకు చెందిన శంకదేబ్‌గౌడ్‌(18), శ్రీపతి మాజి(23), మహారాష్ట్రకు చెందిన దంపతులు బింద్రేశ్‌ భవానీచౌహాన్‌(30), ఖుషి(20) ఉన్నారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు, బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఉపేందర్‌రావు తెలిపారు. అలాగే మొయినాబాద్‌ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం(47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా.. స్వాగత తోరణం విరిగి ఆమె తలపై పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.

విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు

హయత్‌నగర్‌ ముదిరాజ్‌ కాలనీకి చెందిన అంజలి బుధవారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌ పురపాలిక పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలో తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్‌ సన్‌రైజ్‌ కాలనీ రోడ్డు 3లో విద్యుత్‌ తీగ తెగిపడింది. దీనిని గమనించిన అంజలి సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలుచుకురావడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్‌(5) తీగను తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన షేక్‌ పర్వేజ్‌(40) వర్షంలో తన పంక్చర్‌ దుకాణం బయట ట్యూబ్‌లైట్‌ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. బిహార్‌కు చెందిన దమేంద్ర కుమార్‌యాదవ్‌(33) చందానగర్‌లోని గంగారంలో తాను పని చేసే టీ బండిని విద్యుత్‌ స్తంభానికి గొలుసుతో కడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు.

 మూసారాంబాగ్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి(45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి అపస్మారక స్థితికి చేరారు. ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.


సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు

బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతిచెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


నాలాలో పడి కార్మికుల మృతి

ఒడిశాకు చెందిన చంద్ర పాండా(38), మనోజ్‌ దాస్‌(45)లు పదేళ్ల కిందట నగరానికి వచ్చారు. నెల రోజులుగా బేగంపేటలోని ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీలో నివసిస్తూ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో పనిచేసేవారు. మంగళవారం సాయంత్రం వారి ఇంటికి సమీపంలోని బారుకెళ్లి మద్యం తాగారు. అనంతరం బయటకు వచ్చిన ఇద్దరూ భారీ వర్షంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేగంపేట నాలాలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారని బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు