నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు

రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు.

Published : 09 May 2024 06:36 IST

జూన్‌ 1 నుంచి తరగతులు
షెడ్యూల్‌ విడుదల
ప్రైవేటు కళాశాలలు ప్రవేశ పరీక్షలు పెడితే కఠిన చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్‌ 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ, ఆర్‌జేసీ, మోడల్‌, కాంపొజిట్‌, ఒకేషనల్‌ తదితర జూనియర్‌ కళాశాలలన్నీ ఈ షెడ్యూల్‌ను పాటించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలలు ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్ష నిర్వహించరాదని, అలా నిర్వహించే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే వాటిపై పబ్లిక్‌ పరీక్షల (మాల్‌ప్రాక్టీస్‌, ఇతర అనైతిక చర్యల నిరోధక) నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, కళాశాలల్లో బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవేశాల సమయంలో ప్రతి కళాశాల భవనం ప్రవేశద్వారం వద్ద.. మంజూరైన సెక్షన్లు, భర్తీచేసే సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలని, ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశారు.


ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ..

  • ఈ నెల 9 నుంచి దరఖాస్తుల జారీ. అదేరోజు మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.
  • జూన్‌ 1న తరగతులు ప్రారంభం. మొదటి దశ ప్రవేశాలు జూన్‌ 30 నాటికి పూర్తిచేయాలి. తర్వాత రెండోదశ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.
  • ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోలను జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశాలు పొందే సమయంలో విద్యార్థులు ఒరిజినల్‌ మెమోతో పాటు టీసీలు సమర్పించాలి.
  • కళాశాలల్లో ప్రవేశాల సమయంలో నిర్దేశిత రిజర్వేషన్లు కల్పిస్తారు. ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థి విధిగా ఆధార్‌ సంఖ్యను పేర్కొనాలి. పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత విరామంతో ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలనుకునే వారు స్థానిక, నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.
  • పదో తరగతిలో జీపీఏ, అందులో సబ్జెక్ట్‌ వారీగా గ్రేడ్‌ పాయింట్లను పరిగణనలోకి తీసుకోని ప్రవేశాలు కల్పించాలి. కళాశాలల్లో మంజూరైన ప్రతి సెక్షన్‌లో 88 మందిని చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు అవసరమయితే ఇంటర్‌ బోర్డు అనుమతి తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానా విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు