Nitish Kumar: బిహార్‌ సీఎంగా తొమ్మిదోసారి.. నీతీశ్‌ రాజకీయ ప్రస్థానమిదీ..

అనేక నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 

Updated : 28 Jan 2024 18:48 IST

పట్నా: అనేక నాటకీయ పరిణామాల తర్వాత బిహార్‌ (Bihar)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీతీశ్‌తో బిహార్‌ గవర్నర్‌ ఆర్లేకర్‌ ప్రమాణం చేయించారు. భాజపా, ఎల్‌జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఇతర నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంగా సామ్రాట్‌ చౌదరి ప్రమాణం చేశారు.

నీతీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

బిహార్‌లో ఎన్డీయే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నీతీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాలకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త బృందం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలందిస్తుందన్న నమ్మకం ఉందని ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.

నీతీశ్‌ రాజకీయ ప్రస్థానమిదీ.. 

పట్నా సమీపంలోని ఓ భక్తియార్‌పుర్‌లో 1951లో నీతీశ్‌ కుమార్‌ జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆయుర్వేద వైద్యుడు. బిహార్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (ప్రస్తుతం పట్నా ఎన్‌ఐటీ)లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన నీతీశ్‌.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే లాలూ ప్రసాద్‌, సుశీల్‌ కుమార్‌ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది.

వారం రోజులే సీఎంగా..!

1985 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం సాధించినప్పటికీ.. నీతీశ్‌ లోక్‌దళ్‌ పార్టీ తరఫున హర్నౌత్‌ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఐదేళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బిహార్‌లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతోన్న తరుణంలో జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం వారం రోజులే (2000 మార్చి 3- 10) కొనసాగారు. అనంతరం జనతాదళ్‌ (యునైటెడ్‌)ను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

2005లో బిహార్‌ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నీతీశ్‌ కుమార్‌.. మొదటి ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై దాడులు, డబ్బుల కోసం కిడ్నాప్‌లతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో శాంతిభద్రతలను గాడిన పెట్టి విమర్శకుల మన్ననలు పొందారు. భాజపాతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ముస్లిం (పస్మందా) వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2014 మే వరకు అధికారంలో కొనసాగారు.

2017 రిపీట్‌..

2013లో భాజపాకు బ్రేకప్‌ చెప్పిన నీతీశ్‌ కుమార్‌.. కాంగ్రెస్‌, సీపీఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో తొమ్మిది నెలలపాటు జితన్‌రామ్‌ మాంఝీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్‌, ఆర్జేడీ కలిపి మహా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది రెండేళ్లపాటే కొనసాగింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నీతీశ్‌.. 2017లో తిరిగి ఎన్‌డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం భాజపానే అని భావించిన నీతీశ్‌ కుమార్‌.. 2022లో మళ్లీ ఎన్‌డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన.. సీఎంగా బాధ్యతలు చేపట్టి 18నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు.

భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టి..

మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహార్‌లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్‌ కుమార్‌.. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నీతీశ్‌ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని