
Amit Shah: రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు: అమిత్ షా
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని, అది ఎప్పటికీ జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే ‘జన్ విశ్వాస్ యాత్ర’లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అఖిలేశ్‌యాదవ్ తన పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తానని అంటున్నారని, అది జరగని పని అని కేంద్రమంత్రి అన్నారు.
‘‘అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలోని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కులతత్వ పార్టీలు. మోదీజీ, యోగీ జీ మాత్రం ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్’ నినాదంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పింది భాజపానే. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ 300కుపైగా సీట్లు గెలుస్తుంది’’అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.