TS: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోలాహలం 

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల కోలాహలం నెలకొంది. నల్గొండ, హైదరాబాద్‌ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రేపు మంగళవారం కావడం వల్ల .......

Published : 22 Feb 2021 18:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల కోలాహలం నెలకొంది. నల్గొండ, హైదరాబాద్‌ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రేపు మంగళవారం కావడం వల్ల అభ్యర్థులందరూ దాదాపు సోమవారమే తమ నామ పత్రాలను సమర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి సందడి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, తెరాస అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణీదేవి  మినహా  మిగతా వాళ్లు నామినేషన్‌ వేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి సురభి వాణీదేవిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌..  ఆమెకు బీఫారం అందజేశారు. అయితే నామినేషన్‌ ఫారం సరైన ఫార్మాట్‌లో లేదని ఎన్నికల అధికారులు చెప్పారు. నామినేషన్ల స్వీకరణ సమయం ఈ రోజు ముగియడంతో వాణీదేవి మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి భాజపా అభ్యర్థిగా రామచంద్రరావు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకముందు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి  బర్కత్‌పురాలోని భాజపా కార్యాలయం నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిన్నారెడ్డిని గెలిపించాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కోరారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి చిన్నారెడ్డి తరఫున రేవంత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ కుటుంబానికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ, లేదా రాజ్యసభ సీటు ఇచ్చినా కేసీఆర్‌ చిత్తశుద్ధిని తాము ప్రశ్నించేవాళ్లం కాదన్నారు. కానీ, ఈ స్థానంలో నూటికి నూరు శాతం ఓడిపోతుందని తెలిసినా వాణీదేవిని నిలబెట్టారంటూ వ్యాఖ్యానించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీవీ ప్రతిష్టను మసకబార్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు.

ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడుతానని వరంగల్‌, ఖమ్మం, నల్గొండ  జిల్లాల భాజపా అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నల్గొండలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. భాజపా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు. అలాగే, ఇదే స్థానానికి తెజస అభ్యర్థి ఆచార్య కోదండరాం నామినేషన్‌ వేశారు. ఆయనతో పాటు చెరకు సుధాకర్‌, తీన్మార్‌ మల్లన్న, రాణి రుద్రమదేవి వేర్వేరుగా నామినేషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు, పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 26 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది.  మార్చి 14న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని