PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 01 Oct 2023 19:49 IST

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ (PM Modi) వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. పసుపుపై పరిశోధనలూ పెరిగాయి. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’ అని ప్రధాని వెల్లడించారు.

అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశంలో పండగల సీజన్‌ మొదలైంది. తెలంగాణలో ఇవాళ రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధికి కలుగుతుంది. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు తెచ్చుకున్నాం. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగింది. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్‌ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది’’ అని మోదీ వెల్లడించారు.

ప్రధాని వస్తే సీఎం కలవట్లేదు: కిషన్‌ రెడ్డి

రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తే, సీఎం కేసీఆర్‌ కలవటం లేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ‘‘తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంది. ఎరువులపై సబ్సిడీ రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్‌ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి. రీజనల్‌ రింగ్‌రోడ్డు చుట్టూ రైల్వే లైన్‌ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం రూ.26 వేల కోట్లు కేటాయించింది’’ అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని