Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ

తెలంగాణ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ కోరారు.

Published : 24 Sep 2023 19:31 IST

హైదరాబాద్‌: తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు సీట్లు కేటాయింపు విషయమై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులంతా నిర్ణయించినట్లు ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించి టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన బీసీ నేతల సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షెట్కర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. బీసీలకు భారాస 23 సీట్లు ఇచ్చిందని గుర్తు చేసిన మధుయాష్కీ.. కాంగ్రెస్‌లోనూ బీసీలకు న్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 హామీలపై ప్రజల్లో మంచి స్పందన వచ్చినట్లు మధుయాష్కీ వివరించారు. తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం దిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని