సీబీఐ, ఈడీ అధికారులేమైనా మీ కార్యకర్తలా?

అయోధ్య రామ మందిర ట్రస్ట్‌ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోని అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరపాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Published : 26 Jun 2021 01:24 IST

ముంబయి: అయోధ్య రామ మందిర ట్రస్ట్‌ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోని అక్రమాలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరపాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలకు ఇది సరిపోయే కేసని చెప్పారు. ఆ భూములపై దర్యాప్తు కోసం భాజపా జాతీయ కమిటీ ఆ మేరకు తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసాల్లో ఈడీ సోదాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, శివసేన మంత్రి అనిల్‌ పరబ్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర భాజపా కార్యవర్గం తీర్మానం చేయడంపై రౌత్‌ మండిపడ్డారు. ‘సీబీఐ, ఈడీ అధికారులు ఏమైనా మీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారా? లేక మీ ఐటీ విభాగం సభ్యులు అనుకుంటున్నారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠను దిగజార్చుతూ.. ప్రత్యర్థులపై దాడులకు భాజపా ఆ సంస్థలను వినియోగించుకుంటోందని ఆరోపించారు. జాతీయ భద్రత, మనీలాండరింగ్‌, జాతీయ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేసే అంశాలపై దర్యాప్తు చేయాల్సిన సంస్థలను ఇలా వాడుకోవడాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని రౌత్‌ ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ భాజపా తీర్మానం చేసిన మరుసటి రోజే ఈడీ దాడులు జరగడం వింతగా ఉందని రాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాస్లే పాటిల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని