Assembly elections: PunjAAP.. దండయాత్రల తర్వాత దక్కిన విజయం..!

Assembly elections: ఎన్నికలకు ముందు అంచనాల్లోనూ, ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేసినట్లుగానే పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

Published : 11 Mar 2022 01:43 IST

Punjab Assembly elections: పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదికే దిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు.. అందరూ గాలివాటం అనుకున్నారు. 2015లో సొంతంగా గెలిచినప్పుడు తొలిసారి అవకాశం ఇచ్చారనుకున్నారు. అదే దిల్లీలో 2020లోనూ భారీగా మెజారిటీతో గెలిచినప్పుడు కూడా దిల్లీకే పరిమితం కదా అనుకున్నారు. కానీ, ఇలా తక్కువ చేసి చూసిన ప్రతిసారీ పుంజుకుంటూనే ఉంది. పడిన ప్రతిసారీ ఉవ్వెత్తున లేస్తూనే ఉంది. తాజాగా అదే స్ఫూర్తితో మరోసారి కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ వంటి పార్టీలను మట్టికరిపించి పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆ పార్టీయే ఆప్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ! ఎన్నికలకు ముందు అంచనాల్లోనూ, ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేసినట్లుగానే పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అయితే, దిల్లీలా తొలి ప్రయత్నంలోనే ఆ పార్టీకి ఇది సాధ్యం కాలేదు. దీని వెనుక దాదాపు 8 ఏళ్ల కృషి ఉంది.

పడిలేచిన కెరటం...

పంజాబ్‌లో ఆప్‌ విజయం గురించి మాట్లాడుకోవడానికి ముందు ఆ పార్టీ పంజాబ్‌లో చూసిన ఎత్తుపల్లాల గురించి చెప్పుకోవాలి. అది 2014. లోక్‌సభ ఎన్నికలు. మోదీ హవా కొనసాగుతున్న రోజులవి. అప్పటికే దిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమూ దిగిపోవడమూ రెండూ జరిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పంజాబ్‌లో ఆప్‌ ఒక్కసారిగా మెరిసింది. తొలి ప్రయత్నంలోనే 13 లోక్‌సభ స్థానాలకు గానూ 4 చోట్ల విజయం సాధించింది. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి అందరి దృష్టినీ ఆకర్షించింది. అక్కడకు మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2017) 20 స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నా.. కెప్టెన్‌ అమరీందర్‌ ఛరిష్మా కారణంగా ఆ కల సాకారం కాలేదు. అయితే, ఆ తర్వాత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లోకి జారుకున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. కేవలం ఒక్కటంటే ఒక్కటే శాతం ఓటింగ్‌ కూడా రాలేదు. సంగ్రూర్‌ నుంచి మాన్‌ ఒక్కరే విజయం సాధించారు. కానీ మూడేళ్లు తిరగకముందే మళ్లీ జరిగిన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదుచేసి మరోసారి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ విజయంలో ఆప్‌ కృషి కొంతైతే.. కాంగ్రెస్‌ స్వీయ తప్పిదాలు, శిరోమణి అకాలీదళ్‌ బలహీన పడడం వంటివి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయానికి బాటలు వేశాయి.

‘చన్నీ’ లెక్క తప్పింది.. సిద్ధూ మాటే నిజమైంది! 

2017లో పంజాబ్‌లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించిన అమరీందర్‌కు పొగబెట్టి చన్నీని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్‌. ఎన్నికల హామీల విషయంలో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడంతో పాటు దళిత ముఖ్యమంత్రిని ప్రకటించడం ద్వారా భారీ ఓటు బ్యాంకు కలిగిన ఆ వర్గం ఓట్లు సాధించొచ్చన్నది కాంగ్రెస్‌ అంచనా. కానీ దళిత ఓట్లను సమర్థంగా తమవైపు తిప్పుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. దీనికి ప్రధాన కారణం పార్టీలో అంతర్గత కుమ్ములాటే అనడంలో సందేహం లేదు. తొలుత అమరీందర్‌తో పేచీ పెట్టుకున్న సిద్ధూ.. తర్వాత చన్నీతోనూ అదే వైఖరి కొనసాగించారు. ‘కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించగలదు’ అంటూ ఓ సందర్భంగా సిద్ధూ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలయ్యాయన్నది ప్రస్తుత ఫలితాలకు నిదర్శనం. దీనికి తోడు దళితులను ప్రసన్నం చేసుకునేందుకు బీఎస్పీతో అకాలీదళ్‌ జట్టుకట్టడం ఓట్లలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆప్‌ సైతం ఎస్సీలకు ఉచిత విద్య, పోటీ పరీక్షలకు కోచింగ్‌ రుసుములు భరిస్తామంటూ హామీ ఇవ్వడం ఆ వర్గం ఓటర్లను కొంతమేర ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన సమస్యలపై ఆప్‌ గురి..

పంజాబ్‌లో ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి మరీ పెద్ద పెద్ద హామీల జోలికి పోకుండా రాష్ట్రంలో ప్రధాన సమస్యలపైనే ఆప్‌ గురిపెట్టింది. డ్రగ్స్‌ మాఫియాను అరికట్టడం, గురు గ్రంథ్‌ సాహిబ్‌ను అవమాన పరిచిన వారిని శిక్షించడం వంటి అంశాలను తన హామీల్లో చేర్చింది. దీంతో పాటు రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలను దూరం చేస్తామని హామీ ఇచ్చింది. 2017లో ఇవే సమస్యల ఎజెండాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని సొంతపార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. అమరీందర్‌ను పక్కకు పెట్టడంలో ఇదీ ఓ కారణం. దీంతో పంజాబ్‌ ప్రజల ఆకాంక్షలనే హామీలుగా చేసుకోవడంలో ఆప్‌ సఫలీకృతమైంది. ఇందులో భాగంగానే డ్రగ్స్‌ మాఫియాను అరికడతామంటూ పలు వేదికలపై కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఎంతటివారినైనా జైలుకు పంపుతామని చెప్పారు. అదే సమయంలో మహిళల ఖాతాల్లో వెయ్యి రూపాయలు, దిల్లీ తరహాలో ఉచిత విద్యుత్‌ వంటి హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. అకాలీదళ్‌ క్షీణత

పంజాబ్‌లో అధికారం గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ (బాదల్‌)- భాజపా కూటమిల మధ్య మార్పిడి జరుగుతూ వచ్చింది. రెండు పక్షాల పాలనను ఏళ్లుగా చూసిన ఓటర్లు.. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలన, నిరుద్యోగం తదితర సమస్యలతో విసిగిపోయారు. గత కొన్నేళ్లుగా కొత్త పక్షం వైపు చూస్తున్న ఓటర్లకు.. ఆప్‌ ఆశాకిరణంగా కనిపించింది. కాంగ్రెస్‌పై వ్యతిరేకత, రైతు చట్టాల విషయంలో అకాలీదళ్‌ వ్యవరించిన వైఖరి వల్ల ఆ రెండు పార్టీలూ ప్రజలకు దూరమయ్యాయి. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌)తో భాజపా కలిసి పోటీ చేసినా దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం ఆప్‌కు కలిసొచ్చింది.

రైతు చట్టాల వ్యతిరేక పోరులో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో కర్షకులు కదం తొక్కారు. వీరంతా దిల్లీ సరిహద్దుల్లోనే ఏడాది పాటు ఆందోళన నిర్వహించారు. ఈ విషయంలో ఆప్‌ మొదటి నుంచీ రైతులకు అనుకూలంగా వ్యవహరించింది. వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. దీంతో పంజాబ్‌లోని మెజార్టీ రైతులు ఆప్‌ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దిల్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుండడం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్‌ వంటివీ పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌ ప్రజలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

భగవంత్‌మాన్‌ క్లీన్‌ ఇమేజ్‌..

ఈ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఎంపీ భగవంత్‌మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం విజయావకాశాలను దెబ్బతీసిందన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ సారి ఆ పార్టీ ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించింది. కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మాన్‌.. ఆప్‌లో చేరి కీలక నేతగా ఎదిగారు. ఆయనపై పలు ఆరోపణలున్నప్పటికీ అవినీతి మరకలు లేకపోవడంతో పంజాబ్‌ ప్రజలు ఆయన నేతృత్వంలోని ఆప్‌కు పట్టం కట్టారు. ప్రత్యేకించి సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి పార్టీ విభాగాలను నిర్మించారు. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దోహదం చేసింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు